RMCANA ఆక్సిజన్ పరికరాల వితరణ..


Ens Balu
3
Kakinada
2021-06-20 10:13:41

కోవిడ్ నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్‌లో రోగులకు ప్రాణవాయువును అందించేందుకు ఉపయోగపడే 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రంగరాయ మెడికల్ కాలేజ్ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్ఎంసీఏఎన్ఏ) సమకూర్చింది. అదే విధంగా ఆక్సిజన్‌పై ఉన్న రోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు చేర్చేందుకు, వివిధ పరీక్షల కోసం ఆసుపత్రిలో ల్యాబ్‌ల‌కు పంపించేందుకు ఉపయోగపడే 10 ఆక్సిజన్ సిలిండర్ హోల్డింగ్ కేజ్ ట్రాలీలను రూ.1,08,500 ఖర్చుతో డాక్టర్ ఎం.భానుప్రసాద్ మెమోరియల్ ట్రస్టు సమకూర్చింది. జీజీహెచ్‌లో రోగులకు సేవలందిస్తున్నకోవిడ్ వారియర్లు అయిన హౌస్ సర్జన్లకు అందించేందుకు వీలుగా రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ.66 వేల ఖర్చుతో 200 నాణ్యమైన ఫేస్ షీల్డ్‌ల‌ను సమకూర్చారు. వీటిని ఆదివారం జీజీహెచ్‌లో ఆర్ఎంసీఏఎన్ఏ, డాక్టర్ ఎం.భానుప్రసాద్ మెమోరియల్ ట్రస్టు, రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధి డా. ఎస్వీ లక్ష్మీనారాయణ.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరుల చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు అందించారు. కార్యక్రమంలో జీజీహెచ్ కోవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి సూర్య ప్రవీణ్‌చంద్‌, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధర్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.