విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ లో భాగంగా ఆదివారం మొత్తం 30 కిలోల చందనం లభ్యమైనట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ రోజు నుంచి మరో ఒక్కరోజు మాత్రమే చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించి ఈ నెల 24వ తేదీ జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ సమర్పిస్తారు. అదే రోజు స్వర్ణ పుష్పార్చన, శ్రీమణవాళ మహామునుల మాస తిరునక్షత్రం ఉంటుందన్న ఈఓ స్వామివారికి చందనం సమర్పించాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 , కిలోకి 20,116 సమర్పించుకోవచ్చునన్నారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం ప్రసాదంగా ఇస్తారని వివరించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి 6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అప్పన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.