శ్రీకాకుళంజిల్లాలో మెగా వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అయింది. ప్రభుత్వం ఇచ్చిన 81 వేల డోసుల లక్ష్యం కాగా దానిని అధిగమించి జిల్లాలో అందుబాటులో ఉన్న వాక్సిన్ నిల్వలను ఉపయోగించుకుంటూ సాయంత్రం 6.15 గంటలకు 88 వేల మందికి వాక్సిన్ ఇచ్చి లక్ష్యాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లాతో సమానంగా లక్ష్యాలు ఇచ్చిన ఇతర జిల్లాలతో పోల్చుకుంటే శ్రీకాకుళం జిల్లా మొదటి స్ధానంలో నిలిచింది. జిల్లాలో వాక్సినేషన్ విజయవంతం చేయుటకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మార్గదర్శకత్వంలో ప్రణాళికలను రూపొందించారు. ఎక్కడా వాక్సిన్ వృధా కాకుండా ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్ధాయిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో అధికారులు ఏర్పాట్లు చేసారు. మూడు వందల సచివాలయాల పరిధిలో కోవాక్సిన్, కోవీషీల్డ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం మూడు వందల మందికి వాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంటూ చర్యలు చేపట్టారు. దానిని దిగ్విజయంగా సాధించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శ్రీకాకుళం కంపోస్టు కాలనీ, నరసన్నపేట మండలం కోమర్తి, నరసన్నపేట, పోలాకి మండలం ఈదులవలస తదితర ప్రాంతాల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. తన పర్యటనలో భాగంగా అధికారులు, సిబ్బంది, ప్రజలను కలిసి వాక్సినేషన్ పై అవగాహన కలిగించారు.
జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం తదితర ప్రాంతాల్లో తనిఖీ చేయగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట, లావేరు మండలం బెజ్జిపురం తదితర గ్రామాల్లో పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి ఇచ్చిన లక్ష్యాలను సునాయాసంగా సాధించుటకు చర్యలు చేపట్టారు. వాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో రద్దీ జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. వాక్సినేషన్ కు వచ్చిన వారికి ప్రత్యేకంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేసారు. వాక్సినేషన్ అనంతరం పరిశీలన గదిలో అర గంట సేపు వాక్సిన్ తీసుకున్న వారిని కూర్చోబెట్టి తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి అధికారులు వివరించారు. శ్రీకాకుళం పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి పి.వి.ఎస్.ప్రసాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో మెగా వాక్సినేషన కార్యక్రమం విజవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. సమష్టి కృషితో, టీమ్ స్పిరిట్ తో దీనిని సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమీషనర్ జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రత్యేక అధికారులు, సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.శ్రీనివాసులు శ్రమించారని పేర్కొంటూ అభిందించారు. వీరి సహకారంతో రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో వాక్సినేషన్ కార్యక్రమంతోపాటు ఇతర కార్యక్రమాలను చేపట్టి విజయ పథంలో నడుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. శ్రీకాకుళం జిల్లాతో సమానంగా లక్ష్యాలు నిర్ధేశించిన జిల్లాల కంటే ఎక్కువ టీకాలు వేసి ఆయా జిల్లాల కంటే మొదటి స్ధానంలో ఉండటం గమనార్హమన్నారు. ప్రజలు మంచి సహకారం అందించి వాక్సినేషన్ కు ముందుకు వచ్చారని అభిందించారు. వాక్సినేషన్ పై అపోహలు అవసరం లేదని, వాక్సినేషన్ తో కోవిడ్ ను పారద్రోలవచ్చని కలెక్టర్ శ్రీకేష్ సూచించారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి, 5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారుల తల్లులకు, హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతను ఇస్తూ రెండవ డోసు వేయడంతోపాటు అర్హులకు మొదటి డోసును వేయడం జరిగిందని ఆయన వివరించారు. వాక్సిన్ వేసుకొనుటకు అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.