కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించడంతో పాటు, కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పని సరిగా వేయించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రజలను కోరారు. ఆదివారం మద్యాహ్నం మంత్రి కన్నబాబు కాకినాడ రూరల్ నియోజక వర్గం పండూరు పిహెచ్సి పరిధిలో వాకలపూడి జడ్పి హైస్కూల్లోని వాక్సినేషన్ కేంద్రంలో నిర్వహించిన టీకామహోత్సవ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 10 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇంతటి భారీ స్థాయిలో టీకాల పంపిణీ చేసే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదని, రాష్ట్రంలో ఆదర్శవంతమైన రీతిలో పటిష్టంగా పనిచేస్తున్న గ్రామసచివాలయాలు, వలంటీరు వల్లే ఇది సాధ్యమైందన్నారు. వీటి రూప శిల్పి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ముందు చూపుకు, పాలనా దక్షతలకు ఈ సంస్కరణలు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లు, గ్రామ సచివాలయాలు ప్రభుత్వపరమైన ఏ సమాచారమైన, సంక్షేమ లబ్దినైనా కొన్ని గంటలల్లోపే లక్ష్యిత ప్రజలు సమగ్రంగా అందిస్తున్నారని తెలిపారు.
45 ఏళ్లు దాటిన ప్రజలు, 5 ఏళ్లలోపు బిడ్డలున్న తల్లులకు ఆదివారం కాకినాడ రూరల్ నియోజక వర్గం పరిధిలోని కాకినాడ రూరల్ మండలంలో 3500, కరప మండలంలో 1500, నగర డివిజన్లలో 1000 వెరసి 6000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందన్నారు. కోవిడ్ నివాణకు మాస్కులు ధరించడం, చేతుల శుభ్రత, వ్యక్తుల మద్య భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ రక్షణ జాగ్రతలను ప్రతి ఒక్కరూ విధిగా పాటిస్తూ, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను తప్పని సరిగా వేయించుకోవాలని మంత్రి కన్నబాబు ఈ సందర్భంగా కోరారు. అలాగే కాకినాడ రూరల్ నియోజక వర్గంలో ఆదివారం టీకా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న యండిఓ, పిహెచ్సి వైద్యాధికారులు, సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, టీకా వేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు అందరినీ మంత్రి ప్రత్యేకం అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ యంపిడిఓ పి.నారాయణమూర్తి, పండూరు పిహెచ్సి వైద్యాధికారి డా.నారాయణరావు, ఎఎంసి చైర్మన్ గీసాల శ్రీనివాసరావు, జమ్మలమడక నాగమణి, నులుకుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.