ఆర్బీకేలు రైతన్నకు దిక్సూచి కావాలి..


Ens Balu
4
Machilipatnam
2021-06-20 13:56:32

రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృఢ సంకల్పమని రాష్ట్ర  రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల  మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు.  ఆదివారం జిల్లా పరిషత్  కన్వెన్షన్ సెంటర్ లో  ఖరీఫ్ సాగు సమాయత్తంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర  రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ), రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు  (నాని)లు హాజరయ్యారు.  ఈ  సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ  రైతుల కోసం ఇప్పటికే  ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని, అందులో భాగంగా రైతు భరోసా క్రింద ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని,ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు.  అంతేకాక పంటలకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే వ్యవసాయ అధికారులు రైతు భరోసా కేంద్రం వద్దే నియమితులై  ఉంటారన్నారు. జిప్సం , జింకు తదితర పోషకాలు మొదలుకొని విత్తనాలు ,ఎరువులు పురుగు మందులే కాకుండా వరి ధాన్యం విక్రయించుకోవాలన్నా రైతుభరోసా కేంద్రమే  రైతన్నకు దిక్సూచి కావాలన్నారు. 

కృష్ణాజిల్లాలో రైతు భరోసా కేంద్రాల నుంచి నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ అధీకృత పంపిణీ  విధానం ద్వారా రైతులకు అందచేస్తుందని మంత్రి పేర్ని నాని  చెబుతూ, ఒకవేళ ప్రభుత్వం పంపిణీ చేసిన ఒకవేళ సరిగా విత్తనం మొలకెత్తకపోయినా  ఆ నష్టాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకోని నాసి రకం విత్తనం కొనుగోలు చేసిన  ఏ ఒక్క రైతుని నష్టపర్చనీయదని తెలిపారు. ఒక నమ్మకమైన వ్యవస్థ ద్వారా రైతులు మేలైన విత్తనాలు పొందడం ఒక మంచి పద్దతని ఇదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆకాంక్ష అని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు 11 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే పొందారని,  ఆ విషయాన్ని దృస్టలో ఉంచుకొని రైతులను చైతన్యపర్చి ఈ ఏడాది కనీసం 30 వేల క్వింటాళ్ల నుంచి 50 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలను రైతులకు అందించాలనే లక్ష్యంతో  వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేటి సమీక్షా సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేయని, ఖరీఫ్ లో సాగుచేయవద్దని సూచించే 10 రకాల వారి వంగడాలపై విస్తృతమైన ప్రచారం చేయాలనీ మంత్రి కృష్ణాజిల్లా సహకార బ్యాంకు అధికారులకు సూచించారు. ఈమేరకు గ్రామాలలో వివిధ కూడళ్లలో పెద్ద ఫ్లెక్సీ లను ఏర్పాటుచేయాలని కోరారు అలాగే ,  కరపత్రాలను ముద్రించి ప్రభుత్వం కొనుగోలు చేయని వర రకాల గురించి రైతులలో అవగాహన పెంపొందించాలన్నారు. 
    
          ఉచితంగా పంటల భీమా అమలు చేస్తున్న రాష్ట్రం మనదని, అలాగే రైతులకు వై.యస్.ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించడమే కాకుండా  9 గంటల నాణ్యమైన విద్యుత్ ను  అందిస్తున్నామని అన్నారు.  రైతు భరోసా కేంద్రాల ద్వారా 99 శాతం రైతు  సమస్యలు అక్కడే తీరిపోతాయని చెప్పారు. కృష్ణాజిల్లాలో గత ఏడాది వారి పంటను  2 లక్షల 30  వేల 475 ఎకరాలు ఖరీఫ్ సాగు జరిగిందని హెక్టారుకు 5, 265 కిలోల ధాన్యం  దిగుబడి లభించిందన్నారు. ఈ ఏడాది వరిపంట తర్వాత పప్పు ధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగుకు పెద్ద పీట వేయనున్నట్లు పప్పు ధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగు పెంచడంపై కూడా అధికారులు ప్రత్యేక  దృష్టి పెట్టాలని ఈ మేరకు రైతుల్లో అవగాహన పెంచాలని మంత్రి సూచించారు. ప్రతి నెల పంటలకు వేసే ఎరువులను బట్టి ఆ నెల అవసరాలతో అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.  యూరియా డీఏపీ, ఎంఓపీ వంటి పలురకాల రసాయనిక ఎరువులు రైతులకు అవసరమవుతాయి. ప్రస్తుతం రైతుల అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉంచాలని మంత్రి పేర్ని నాని కోరారు. 

     కృష్ణాజిల్లాలో  4, 826 మంది లబ్ధిదారులకు సంబంధించిన  జగనన్న తోడు పథకం తాలూకా నగదు కేడీసీసీ బ్యాంకు ద్వారా 4 కోట్ల 82 లక్షల 60 వేలు రూపాయలను లబ్ధిదారులకు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జాయింట్ కలెక్టర్ మాధవీలత చేతుల మీదుగా ఆ చెక్కును లబ్ధిదారులకు అందచేశారు.  ఈ సమీక్షా సమావేశంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత, మచిలీపట్నం ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి , జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ టి. మోహనరావు,  కె డి సి సి  బ్యాంకు సి ఇ  ఓ  ఎ . శ్యామ్ మనోహర్ ,  సివిల్ సప్లైస్ డి ఎం కె. రాజ్యలక్ష్మి , జెడ్పి సి ఇ  ఓ  పి ఎస్ సూర్యప్రకాశరావు, మచిలీపట్నం తహసిల్దార్ సునీల్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.