కోవిడ్ వేక్సినేషన్ డ్రైవ్ విజయవంతం..
Ens Balu
2
Vizianagaram
2021-06-20 14:36:09
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఆదివారం చేపట్టిన కోవిడ్ మెగా వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ఆశించిన దానికంటే మించి విజయవంతం అయ్యింది. రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి మించి వాక్సినేషన్ జరగడంతో జిల్లా అధికారుల నుంచి మండల, క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అంతా సంతోషం వ్యక్తమవుతోంది. శుక్రవారం సాయంత్రం విడియో కాన్ఫరెన్స్ లో మెగా వాక్సినేషన్ డ్రైవ్ కోసం ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ లు కార్యాచరణకు దిగారు. అదే రోజున పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడం, మండల పరిధిలోని ఎం.పి.డి.ఓ.లు, మునిసిపల్ కమిషనర్ లతో జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేలా పర్యవేక్షణ చేశారు. మరో వైపు ఏ.ఎన్.ఎం.లు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు తదితర క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహణలో ఇప్పటికే తగిన అనుభవం కలిగి వుండటం వల్ల ప్రత్యేక డ్రైవ్ ను సులువుగా పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకే సిబ్బంది వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల కూడా ఎక్కువ మంది వాక్సిన్ వేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. రోజంతా ప్రతి గంట కు నివేదికలు రప్పించుకొని తక్కువగా వాక్సినేషన్ జరిగిన మండలాల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేస్తూ జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ జిల్లా కేంద్రం నుండే పర్యవేక్షణ చేశారు. జిల్లా పరిషత్ సి ఇ ఓ టి. వేంకటేశ్వర రావు తన పరిధిలోని ఎం.పి.డి.ఓ.లతో రోజంతా మాట్లాడుతు వారిని ఉత్సాహ పరిచారు. వీరందరి కృషి ఫలించి రాత్రి 7 గంటల సమయానికి జిల్లాలో 58,005 మందికి వాక్సిన్ వేయగలిగారు. రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.