రక్తదానం నిరంతర ప్రకియ కావాలి..


Ens Balu
3
Srikakulam
2021-06-21 13:00:32

శ్రీకాకుళం జిల్లాలో రక్తదానం చేయడం నిరంతర ప్రక్రియ కావాలనికలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్  వైద్యులు, ఆర్గనైజర్లు, వాలంటీర్లను కోరారు. ప్రపంచ రక్తదాన వారోత్సవాల ముగింపు సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమానికి   జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత రక్తదానం చేసేందుకు కృషిచేసిన వైద్యులు, వివిధ సంస్థలను, ఆర్గనైజర్లను, వాలంటీర్లకు జ్ఞాపికను అందజేస్తూ దుశ్శాలువ, పుష్పగుచ్చంతో కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, అన్నిదానాల్లో కంటే రక్తదానం గొప్పదని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వారందరూ రక్తదానం చేసేందుకు ముందుకురావాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మానవత్వంతో రక్తదాతలు ముందుకురావాలని,  ఒకరు రక్తదానం చేయడం వలన ఇద్దరి ప్రాణాలను కాపాడినవారవుతారని అన్నారు. ముఖ్యంగా తలసేమియా, శస్త్రచికిత్సల సమయంలో, ప్రమాదాలకు గురికాబడిన వ్యక్తులకు ఈ రక్తం ఎంతో ఆవశ్యకమని, అటువంటి వారికి మీరిచ్చే రక్తం వలన వారితో రక్త సంబంధాలు ఏర్పడినట్లు అవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రక్తదానం చేసి వేరే ప్రాణాలను నిలిపినందుకు మీకు సంతృప్తి లభిస్తుందని, ఆ సంతృప్తి కోసమే మీరు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

రక్తదానం చేసిన యువతకు, రక్తదానం చేయడానికి ప్రోత్సహించిన వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలిపిన కలెక్టర్ జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం రక్తదానం చేసేందుకు యువతను ప్రోత్సహించిన డా. భాస్కర్, డా.అవినాష్, డా.విశ్వనాథ్, ఆర్.సంతోష్ కుమార్, యస్.రాంబాబు, వై.శ్రీనివాసకుమార్, యస్.సత్యనారాయణ, పి.శ్రీనివాసరావు, ప్రసాద్, ఎ.గురుప్రసాద్, కె.విజయశంకర్, పి.కేదారేశ్వరీ, రాజశేఖర్, ఓ.సత్యనారాయణ, జె.లక్ష్ణణసాయి, ఎ.దుర్గారావు, జి.గోవింద్, వి.రాజు, ఎం.అసిరినాయుడు, ఎ.రాజేశ్, పి.లీలాకృష్ణ, బి.గోపిలకు కలెక్టర్ జ్ఞాపిక, దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

          ఈ కార్యక్రమంలో లయన్ డా.కృష్ణమోహన్, ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు సర్వేశ్వరరావు, డా.దేవభూషణరావు, ట్రెజరర్ లయన్ పి.రవికుమార్, వైద్యులు, వివిధ సంస్థల ఆర్గనైజర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.