డయల్ యువర్ కలెక్టర్ కు 18 వినతులు..


Ens Balu
4
Srikakulam
2021-06-21 13:09:45

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 18 వినతులు అందాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని స్పందన విభాగంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డి.ఆర్.ఓ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మునిసిపాలిటీ పరిధిలో గల ఉరిటి భాస్కరరావు ఫోన్ చేసి మాట్లాడుతూ  వికలాంగుడైన తనకు  పేట్ రోడ్ వేస్,ముంబాయి వారు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తూరు మండలం  నివగాం నుండి ఎస్.షణ్ముఖరావు ఫోన్ చేస్తూ  తన కూతురుకు వై.యర్.ఆర్ జగనన్న విద్యా దీవెన అందలేదని, కావున దానిని మంజూరుచేయాలని కోరారు. కంచిలి మండలం పోలేరు నుండి కె.వెంకటరావు ఫోన్ లో మాట్లాడుతూ  సచివాలయంలో కేటగిరి -1 లోని పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీచేయలేదని ఫిర్యాదు చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తూరు మండలం కౌసల్యపురం నుండి  కె.రాజేశ్వరి ఫోన్ చేసి మాట్లాడుతూ  తన భర్త మరణించినందున  తనకు వృద్దాప్య పింఛనును మంజూరు చేయాలని కోరారు. ఇచ్చాపురం మండలం పైతారి గ్రామం నుండి వి.మన్మధరావు ఫోన్ చేస్తూ   తనకు 44 శాతం వికలాంగత్వం ఉందని, కావున తనకు వికలాంగుల పింఛనును మంజూరుచేయాలని కోరారు. 

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామం నుండి బి.రవికుమార్ ఫోన్ చేస్తూ  తన భార్య అయిన చంద్రకళ  కొల్లివలస సచివాలయంలో  వాలంటీరుగా పని చేస్తుందని, తనని అకారణంగా విధుల నుండి తొలగించినందున మరలా పునరుద్ధరించాలని కోరుతూ, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చాపురం మండలం  లొద్దపుట్టి నుండి బి.జోగారావు మాట్లాడుతూ లొద్దపుట్టి మేజర్ పంచాయితీ అయినప్పటికి  పంచాయితీ  సెక్రటరీ గాని సచివాలయం సెక్రటరీ గాని లేరని, కావున వారిని నియమించాలని కోరారు. ఎల్.యన్.పేట మండలం కోవిలాం నుండి జి.బాలరాజు ఫోన్ లో మాట్లాడుతూ 60 సంవత్సరాలు పూర్తయిన తనకు వృద్దాప్య పింఛనును మంజూరు చేయాలని కోరారు.  వీరఘట్టం మండలం పి.వి.ఆర్ పురం నుండి కె.పి.నాయుడు ఫోన్ లో మాట్లాడుతూ జగనన్న చేయూత పథకం మంజూరు చేయాలని కోరారు. ఆమదాలవలస మండలం రామచంద్రపురం నుండి జె.వెంకటరమణ ఫోన్ చేస్తూ  తన పూర్వీకుల నుండి ఉన్న  సర్వే నెంబరు 76.2లోని 44 సెంట్లు  భూమిని తన పేరు మీద  నమోదు చేసి అడంగళ్ ను మంజూరుచేయాలని కోరారు. రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ నుండి ఆర్ అండ్ బి రహదారి విస్తరణలో తన ఇళ్లు కూలిపోయిందని, కావున తనకు తగిన నష్టపరిహారాన్ని మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.