సేంద్రీయ ఎరువు తయారీపై మహిళలకు అవగాహన పెంపొందించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం రెండవ జోన్ 10వ వార్డు పరిధిలో ఇందిరా నగర్ కాలనీ పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గృహ అవసరాలకు తెచ్చుకున్న కూరగాయలు తొక్కలను బయట పడవేయకుండా ఇంటిలోనే ఎరువు తయారు చేసుకొనే విధంగా మహిళలకు అవగాహన పెంచాలన్నారు. అనంతరం, ఇందిరానగర్ కాలనీలోని రోడ్లను, కాలువలను పరిశీలించారు. సేకరించిన చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని ఆ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్తను సేకరించే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఇళ్ళ పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా చూడాలని ఆదేశించారు. తద్వారా దోమలు వృద్ధి చెందకుండా అరికట్టవచ్చునన్నారు. వార్డు పారిశుధ్య కార్మీకుల యొక్క పూర్తి వివరాలు వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు వద్ద ఉండాలని, దాని ఆధారంగా వారి విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, వెటర్నరి డాక్టరు కిషోర్, ఇ.ఇ.(వాటర్ సప్ప్లై) పి. శ్రీనివాసరావు, డి.ఇ.ఇ. వంశీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్, తదితరులు పాల్గొన్నారు.