గుంటూరు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తొలి రోజు 24 మంది తమకున్న సమస్యలను ‘డయల్ యువర్ కలెక్టర్’కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ దృష్ఠికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను ఫోన్ ద్వారా విన్న జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమం 11గంటల వరకు కొనసాగింది. ఎక్కువగా గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలోని వారి నుంచి అందిన ఫిర్యాదులు ఉన్నాయి. తాడేపల్లి మున్సిపాలిటీ కి చెందిన ఆయేషా తనకు ఇంటి స్థలం, వంటరి మహిళ పెన్షన్ ఇప్పించాలని కోరారు. సంబంధిత అధికారులకు మీ సమస్యను పంపి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నరసరావుపేటకు చెందిన రహమతుల్లా, కర్లపాలెంకు చెందిన ఏసమ్మ లు తమకు ఇంటి స్థలం ఇప్పించాలని కోరగా, దరఖాస్తులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవమని అధికారులకు ఆదేశిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
గుంటూరు నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన రాటల మల్లేశ్వరి, క్రోసూరు మండలం, గుడిపాడు గ్రామానికి చెందిన మహబూబ్ వలి, నూజండ్ల మండలం,ములకలూరు గ్రామానికి చెందిన మందా వెంకటేశ్వర్లు, యడ్లపాడుకు చెందిన చందు తమ కుటుంబాలకు వై.యస్.ఆర్ చేయూత పధకం అమలు అయ్యేలా అవకాశం కల్పించాలని కోరారు. సంబంధిత మండల అధికారులకు తగు సూచనలు జారీ చేసి వైఎస్సార్ వైఎస్సార్ చేయూత లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెదకాకాని రోడ్డు నివాసితుడు సి.హెచ్. విజయబాబు తనకు వాహన మిత్ర పధకం కింద డబ్బులు జమకాలేదని తెలుపగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
వినుకొండకు చెందిన పఠాన్ ఆసియా బేగం, చిలకలూరిపేటకు చెందిన నూతలపాటి యామలమ్మలు తమకు వితంతు పెన్షన్ ఇప్పించాలని కోరాగా, సమస్య పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వెంటనే ఫిర్యాదులను పరిష్కరించి వివరాలను తెలియజేయాలని, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ) దినేష్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి ) ప్రశాంతి, జిల్లా సంయుక్త కలెక్టర్ (గృహనిర్మాణం) అనుపమ అంజలి, డి.ఆర్.వొ. కొండయ్య, జడ్పీ సీఈవొ చైతన్య, డి.ఆర్. డి.ఏ పి.డి ఆనంద నాయక్, డ్వామా పి.డి శ్రీనివాసరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.