కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు..
Ens Balu
5
Kakinada
2021-06-21 13:56:13
కోవిడ్ కేసులు ఇంకా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉన్న కర్ఫ్యూ నిబంధనలు జూన్ 21 నుంచి 30వ తేదీ వరకు యథాతథంగా కొనసాగుతాయని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51-60; ఐపీసీ సెక్షన్188, ఇతర వర్తింపు చట్టాల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదే విధంగా కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ నిబంధనల కచ్చిత అమలుకు కాకినాడ, రాజమహేంద్రవరం ఎస్‌పీలు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.