యోగ అందరి ఆరోగ్య ప్రదాయని..


Ens Balu
3
Srikakulam
2021-06-21 14:29:24

యోగ ఆరోగ్యప్రదాయని అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంను జిల్లా క్రీడాప్రాధికార సంస్ధ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇండోర్ స్టేడియంలో  సోమ వారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పతంజలి యోగ నిపుణులు డి.చిన్నబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ నిపుణులు సుధారాణి యోగ ఆసనాలకు మార్గదర్శకత్వం వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ యోగ ఆసనాలను సునాయాసంగా వేసారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగ అంటే ఆరోగ్యం అన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఆరోగ్యం పట్ల అశ్రద్ద వహించడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తంచి రోజుకు కనీసం గంట సమయం కేటాయించాలని సూచించారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారాయని, వాతావరణంలో మార్పులు గమనిస్తున్నామని తదనుగుణంగా ఆరోగ్య పరిరక్షణ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. యోగ ఆరోగ్య కల్పనకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మోబైల్ ఫోన్లు, టెలివిజన్ లకు అతుక్కుంటున్నారని కనీస వ్యాయామం చేయడంలో అశ్రద్ద వహిస్తున్నారని అన్నారు. దీని వలన మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు సునాయాసంగా గురి అవుతున్నారని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కొంత సమయం కేటాయించి సాధారణ ఆసనాలు వేసినప్పటికి ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు.

        ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు సెట్ శ్రీ సిఇఓ జి.శ్రీనివాస రావు, క్రీడా ప్రాధికార సంస్ధ చీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్, పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, నెహ్రూ యువ కేంద్ర ఇన్ ఛార్జ్ జిల్లా సమన్వయ అధికారి శ్రీనివాస రావు, క్రీడా ప్రాధికార సంస్ధ కోచ్ లు సూరిబాబు, శ్రీధర్, మాధురి, ఉమామహేశ్వర రావు, ఆయుష్ వైద్యులు డా.మాధవ రావు చౌదరి, డా. సి.హెచ్.మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ను క్రీడాప్రాధికార కోచ్ లు మర్యాదపూర్వకంగా కలిసి పష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం షటిల్ కోర్టు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ కొద్ది సేపు షటిల్ బాడ్మింటన్ ఆడి కోర్టుల పరిస్ధితిని పరిశీలించారు. క్రీడలకు సౌకర్యాలు బాగా మెరుగుపరచాలని ఆయన సూచించారు. అందుకు అవసరమగు నివేదికను తయారు చేయాలని అన్నారు.