ప్రభుత్వ నిర్మాణాల వేగం పెంచాలి..


Ens Balu
2
Anantapur
2021-06-21 14:42:34

ఎన్ఆర్ఈజిఎస్ కింద చేపట్టిన గ్రామ సచివాలయ భవనాల నిర్మాణంలో భాగంగా జూలై ఒకటో తేదీ కల్లా 75 శాతం భవన నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్  అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులంతా సచివాలయ భవనాల నిర్మాణంలో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణంలో కూడా జూలై 8వ తేదీ కల్లా 300 భవనాలు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండేలా చూడాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. పూర్తి అయ్యే దశలో ఉన్న రైతు భరోసా కేంద్రం భవనాలు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు కూడా జూలై 31వ తేదీ కల్లా 50 శాతం పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయ భవనాల నిర్మాణంలో, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి పనులు చేపట్టాలన్నారు. ఆగస్టు 2వ తేదీ కల్లా అన్ని సచివాలయ భవనాల నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు 100 శాతం పూర్తయ్యేలా అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే వైయస్సార్ అర్బన్ క్లినిక్ నిర్మాణంలో భాగంగా రెండు రోజుల్లోగా భవన నిర్మాణాలు గ్రౌండింగ్ చేయాలని, గ్రామం, సచివాలయం వారీగా ప్రణాళిక రూపొందించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ సన్నద్ధతలో భాగంగా అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలన్నారు. నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు లో భాగంగా ఇంటి నిర్మాణాలను వెంటనే ఆషాడ మాసం మొదలు అయ్యే లోగా 100 గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టేందుకు అనుగుణంగా లేఔట్లలో అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ఈ నెలాఖరులోపు లేఔట్లలో అన్ని రకాల సదుపాయాల కల్పన పూర్తి కావాలన్నారు. అలాగే ఇంటి పట్టా కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన గడువులోగా ఇంటి పట్టా ఇవ్వాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు నిర్మాణంలో భాగంగా ఏడిఏలు, ఏఓ లు  భవన నిర్మాణాలను పరిశీలించాలన్నారు. జూలై 8వ తేదీ నాటికి 300 ఆర్బికేలు ప్రారంభించేలా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని, ఏవో లు, పంచాయతీరాజ్ ఏఈలు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని అవగాహన కల్పించాలని, మాస్కులు వాడకపోతే 100 రూపాయల చొప్పున ఫైన్ వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రజలకు 104 కాల్ సెంటర్ పై కూడా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాలకు వచ్చే సర్వీసులు మరింత పెరగాలన్నారు. గడువు తీరిన సమస్యలు పెండింగ్ ఉండడానికి వీలు లేదని, వెంటనే ఇక్కడ వచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డిఆర్ఓ గాయత్రీదేవి, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, వివిధ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.