కోవిడ్ కేసులు తగ్గినా పూర్తిగా తగ్గిపోలేదని, అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి కోవిడ్, ఎన్ఆర్ఈజిఎస్ పనుల కల్పన, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడి కేంద్రాల నిర్మాణం, వైఎస్సార్ అర్బన్ క్లినిక్ లు, పేదలందరికి ఇల్లు కింద ఇళ్ల గ్రౌండింగ్, ఇంటి పట్టాల పంపిణీ, ఖరీఫ్ 2021 సన్నద్ధతపై జిల్లాలోని ఆర్డీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడివోలు, స్పెషల్ ఆఫీసర్ లు, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో మాస్కులు వాడకంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అంటూ గ్రామ సచివాలయం, వార్డు పరిధిలో అవగాహన చేపట్టాలని, నో మాస్క్ నో సేల్ అంటూ దుకాణాల యజమానులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని, నో మాస్క్ నో రైడ్ అంటూ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, వాహనాల్లో ప్రజలెవరూ మాస్కులు లేకుండా ప్రయాణించకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
కోవిడ్ కేసులు తగ్గినా కోవిడ్ నిబంధనలను పాటించాలని, కేసులు పెరగకుండా చూడాలని, కరోనా కారణంగా ఎవరూ మరణించకూడదని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సచివాలయం పరిధిలో పాజిటివ్ రేటు 2 శాతం కన్నా తక్కువగా వచ్చేలా చూడాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ను పాటించాలన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే ను సోమవారం నుంచి శుక్రవారం వరకు తప్పనిసరిగా నిర్వహించాలని, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వాలంటీర్లు ఫీవర్ సర్వే ను పరిశీలించాలని, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలన్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్, శాంపుల్స్ సేకరణ జాగ్రత్తగా చేయాలని, కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిందని, ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు సాధారణ కార్యకలాపాలు జరుగుతాయని, అనంతరం రాత్రి నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ నేపథ్యంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన 90 వేల డోసుల వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేయడం అభినందనీయమని, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు, మండల స్థాయి స్పెషలాఫీసర్ లు, మెడికల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యాక్సిన్ పై బాగా అవగాహన కల్పించారని, వారిని అభినందించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులను కూలీలందరికీ కల్పించాలని, ఆయా మండలాలకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని, ఉపాధి పనుల కల్పనలో వెనుకబడిన మండలాలు వెంటనే పురోగతి చూపించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డిఆర్ఓ గాయత్రీదేవి, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, వివిధ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.