ట్రిబ్యునల్ తీర్పుపై డిప్యూటీ సీఎం హర్షం..


Ens Balu
2
Srikakulam
2021-06-21 14:51:10

బి.అర్.అర్. వంశధార ప్రాజెక్టుకు ఆయువు పట్టైన నేరడి బ్యారేజి నిర్మాణానికి వంశధార ట్రిబ్యునల్ సానుకూలంగా తీర్పును వెల్లడించడం పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సోమవారం మీడియాతో మాట్లాడారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే  ట్రైబ్యునల్‌ అనుమతి ఇచ్చినప్పటికీ గత పాలకులు నిర్లక్ష్యం కారణంగానే సమస్య జఠిలం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. గత ఏప్రిల్ 16వ తేదీన ఈ విషయమై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని, సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వచ్చి మాట్లాడేందుకు సిద్ధమని పేర్కొన్నారని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగు నీటి అవసరాల కోసం వంశధార ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ దశలో కేవలం 106 ఎకరాల తమ భూమి ముంపునకు గురవుతోందని ఒడిస్సా అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఏపీ ప్రభుత్వం సదరు భూసేకరణకు అవసరమైన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వంశధార నదికి ఎడమవైపున   ఒడిస్సా భూభాగంలో బ్యారేజీకి స్లూయిస్ నిర్మించాలన్న ట్రిబ్యునల్ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడి నలుగుతున్న నేరడి బ్యారేజి సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్  సూచించిన విధంగా 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేసి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి కలలు కన్న వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి శ్రీకాకుళం రైతాంగానికి అంకితం ఇస్తామని కృష్ణ దాస్ పేర్కొన్నారు.