యోగాతో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం..


Ens Balu
2
Simhachalam
2021-06-21 15:04:59

కరోనా సమయంలో ప్రతీ ఒక్కరూ యోగా ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొదించుకొని కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని ఈఓ ఎంవీ సూర్యకళ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు యోగాపై అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ, యోగా ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవచ్చన్నారు. దేవస్థానం తరుపున వివేకానంద యోగా కేంద్రం ఉందని.. దీన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. యోగా వలన పదిమందికీ ఉపయోగం కలగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడే కాదు ప్రతిరోజూ యోగా చేయాలని కోరారు. తనకు వీలుచిక్కినప్పుడల్లా దేవస్థానం యోగా సెంటర్లో యోగా ప్రాక్టీస్ చేస్తానన్నారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఓతోపాటు ఉద్యోగులు కూడా ఉత్సాహంగా యోగసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు నరసింహరావు నాయుడు,సూరిబాబు, DEO సుజాత, ఏఈఓ ఆనందకుమార్, ఏఈ హరి తదితరులు పాల్గొన్నారు.