కోవిడ్ మూడవ దశకు ప్రణాళికలు..


Ens Balu
0
శ్రీకాకుళం
2021-06-22 12:00:05

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. స్వచ్చంధ సంస్ధ ఆర్ట్స్ గివ్ ఇండియా అండ్ ఏక్షన్ ఎయిడ్ సంస్ధ సహకారంతో 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జాయింట్ కలెక్టర్ కు మంగళ వారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద అందజేసింది. 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లలో 10 లీటర్ల సామర్ధ్యం గలవి 15, 5 లీటర్ల సామర్ధ్యం గలవి 15 ఉన్నాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో మూడవ దశ కోవిడ్ వ్యాప్తి చెందితే ఎదుర్కొనుటకు ఇప్పటి నుండే అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఆర్ట్స్ సంస్ధ సమకూర్చిన 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా ఉపయోగించుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వీటిని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు, సామాజిక ఆసుపత్రులు తదితర గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో పెడతామని ఆయన పేర్కొన్నారు. తద్వారా అవసరం ఉన్నవారికి తక్షణం వైద్య సహాయం అందుతుందని చెప్పారు. జిల్లాలో మూడవ దశ వ్యాపించకుండా ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని శ్రీనివాసుల కోరారు. మొదటి, రెండవ దశ కరోనా ప్రభావాన్ని ప్రత్యంగా చూసామని వాటి అనుభవం దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించడం మరిచిపోరాదని అన్నారు. భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రపరచడం అవసరమని ఆయన సూచించారు. 

మూడవ దశలో పిల్లలపై ప్రభావం ఉంటుందని పలువురు తెలియజేస్తున్న వార్తలను సైతం చూస్తున్నామని పేర్కొంటూ కోవిడ్ పై అవగాహన కలిగి దాని ప్రభావం లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. జిల్లాలో కోవిడ్ నివారణకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన సంగతి గుర్తు చేసారు. మూడవ దశను కూడా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నామని అయినప్పటికి ప్రజలు సహకరిస్తే జిల్లాలో వ్యాప్తి లేకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నామని ఆయన తెలియజేసారు. 45 సంవత్సరాలు పైబడినవారికి, 5 సంవత్సరాల లోపు చిన్నారుల తల్లలకు, హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతతో వాక్సినేషన్ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

ఆర్ట్స్ సంస్ధ అధ్యక్షులు నూక సన్యాసి రావు మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నివారణలో భాగంగా తమ సంస్ధ సహకరిస్తుందన్నారు. రూ.24 లక్షల విలువగల 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గివ్ ఇండియా అండ్ ఏక్షన్ ఎయిడ్ సంస్ధ సహకారంతో అందిస్తున్నామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్ధ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు తదితరులు పాల్గొన్నారు.