పథకాలపై అవగాహన కల్పించాలి..
Ens Balu
1
Vizianagaram
2021-06-22 12:07:58
ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా, అర్హులందరికీ వాటిని అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు కోరారు. ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమాలైన నవరత్నాలుపై, వరల్డ్ విజన్ ఏర్పాటు చేసిన రెండు ప్రచార వాహనాలను, స్థానిక యూత్ హాస్టల్ వద్ద జాయింట్ కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి వెంకటరావు మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై ప్రచారానికి ముందుకు వచ్చిన వరల్డ్ విజన్‌ను, ఆ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రచార కార్యక్రమాన్ని కేవలం ఒకటిరెండు మండలాలకే పరిమితం చేయకుండా, జిల్లా అంతటా నిర్వహించాలని కోరారు. పేదలను ఆదుకొనేందుకు సంస్థ చేసిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో ఒక్కో యూనిట్ పదివేల రూపాయల చొప్పున ముగ్గురికి తోపుడు బళ్లను, ఐదుగురికి కిరాణా యూనిట్లను, ఇద్దరికి కుట్టు మిషన్లను, ఒకరికి ఎంబ్రాయిడరీ మిషన్ ను అందజేశారు. అలాగే సుమారు వందమందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెట్విజ్ సిఇఓ విజయకుమార్, వరల్డ్ విజన్ ప్రతినిధులు అంబేద్కర్, లక్ష్మణ్, నాగేశ్వర్రావు, గోపాల్, గ్రేస్ తదితరులు పాల్గొన్నారు.