త్వరలో నేరేడు బ్యారేజ్ కు శంకుస్థాపన..


Ens Balu
2
Srikakulam
2021-06-22 12:19:00

నేరేడు బ్యారేజి నిర్మాణానికి అతి త్వరలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర  పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. వైయస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్న డాక్టర్ అప్పలరాజు కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. వంశధార రెండవ దశ పూర్తి చేసే గొప్ప అవకాశం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు రావడం ఎంతో సంతోషించదగిన విషయం అని ఆయన అన్నారు. ఒడిశా రాష్ట్రానికి ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అనుమతించడమే కాకుండా ఏపీ అవసరాలకోసం బ్యారేజీకి కుడివైపున హెడ్‌ స్లూయిస్‌ నిర్మాణానికి అంగీకారం తెలిపిందని ఆయన అన్నారు. 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం హర్షించదగిన పరిణామమని ఆయన తెలిపారు. ఒడిశా అవసరాల కోసం ఎడమ వైపున స్లూయిస్‌ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అంగీకారం తెలియజేస్తూ ఎంత సామర్థ్యంతో ఎడమ స్లూయిస్‌ కావాలో గెజిట్‌ విడుదల చేసిన 6 నెలల లోపు రాష్ట్రానికి ఒడిశా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసిందని మంత్రి వివరించారు. ఎడమ స్లూయిస్‌ కోసం అయ్యే ఖర్చును ఒడిశా భరించాలని  ట్రైబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నీటిని తరలించుటకు రాష్ట్రానికి ట్రైబ్యునల్‌ అనుమతి ఇవవడం వలన శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కానుందని అన్నారు. నేరడి బ్యారేజీ కోసం ఒడిశాలో ముంపునకు గురవుతున్న 106 ఎకరాల భూమిని ఒడిశా సేకరించి ఇవ్వాలని, దాని కోసం అయ్యే ఖర్చును రాష్ట్రం భరించాలని తీర్పు ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేయగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆ కలను సాకారం చేశారని మంత్రి అన్నారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి తో సంప్రదించుటకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లేఖ కూడా రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. నేరేడు బ్యారేజి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు.