సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు..


Ens Balu
2
Srikakulam
2021-06-22 12:19:56

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రెండో ఏడాది వై.యస్.ఆర్.చేయూత కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్న శాసన సభాపతి కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి 45 నుండి 60 సంవత్సరాల వయస్సుగల మహిళలకు వై.యస్.ఆర్ చేయూతను అమలు చేయడం ముదావహమన్నారు. చేయూత కార్యక్రమం వలన వివిధ జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతూ కుటుంబం ఆర్ధికంగా ముందంజ వేయుటకు సహాయం చేస్తున్నారని చెప్పారు. పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.19వేల కోట్ల సాయం అందించే కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండవ ఏడాది 23,14,342 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. వరుసగా నాలుగేళ్లు ప్రతీ ఏటా రూ.18,750/-లు చొప్పున మొత్తం రూ.75 వేలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 2,15,668 మంది లబ్ధిదారులు నమోదుచేసుకోగా, 1,91,417 మందికి వై.యస్.ఆర్.చేయూత పథకం అందించడం జరిగిందన్నారు. రెండో విడతలో 1,88,572 మంది నమోదుచేసుకోగా 1,85,475 మందికి అందిస్తున్నట్లు వివరించారు. ఇందులో యస్.సి లబ్ధిదారులు 18,482 మంది, యస్.టి లబ్ధిదారులు 10,227 మంది , బి.సి లబ్ధిదారులు 1,56,272 మంది కాగా మైనారిటీ వర్గాలకు చెందిన వారు 494 మంది వెరశి 1,85,475 మంది ఉన్నారని ఆయన తెలిపారు. లబ్దిదారులకు రూ.347.76 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని శాసన సభాపతి తెలిపారు.