అనాద చిన్నారులకు రక్షణగా ప్రభుత్వం..
Ens Balu
2
Srikakulam
2021-06-22 12:51:18
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. కోవిడ్ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన 7 గురు చిన్నారులకు మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ.10 లక్షల విలువగల బాండ్లను శాసన సభాపతి సీతారం, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సమక్షంలో పంపిణీ చేసారు. బాలల విద్యాభ్యాసం, సంరక్షణకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం రూ.10 లక్షల బాండ్లను అందిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రూ.10 లక్షల బాండ్ల ద్వారా వచ్చే ఆదాయం చిన్నారులు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి ఎంతో మంచి ఆలోచనతో అందించారని, దీనిని సక్రమంగా వినియోగించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దు కోవాలని ఆయనకోరారు. బాండ్లను పొందిన వారిలో రాజాం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన వాకముల్ల కామేశ్వరరావు, వాకముల్ల పార్థసారథి, ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన చింతపల్లి గీత, చింతపల్లి మూర్తి, ఎల్.ఎన్.పేట మండలం బొట్టాడసింగి గ్రామానికి చెందిన వాడాడ కిషోర్ కుమార్, మందస మండలం బేతాళ పురం గ్రామానికి చెందిన బత్తిన గణేష్, జలుమూరు మండలం కేఎల్ఎన్ పేట గ్రామానికి చెందిన కూన తిరుమల తేజలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి., తూర్పుకాపు, కళింగకోమటి కార్పొరేషన్ల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి, డిసిసిబి మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.వి.బి.డి. హరిప్రసాద్, ఐసిడిఎస్ పథక సంచాలకులు డా.జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.