రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేయకుండా అమలు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీసీ హాలునందు వైఎస్సార్ చేయూత రెండవ విడత నగదు బదిలీ కార్యక్రమంలో మంత్రి శంకర నారాయణ పాల్గొన్నారు. తాడేపల్లి గూడెం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 23,14,342 మంది మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్ల రూపాయలు జమ చేశారు. జిల్లాలో 1,99,370 మందికి రూ.373.82 కోట్ల లబ్ది చేకూరింది. ముఖ్యమంత్రి నగదు బదిలీ చేసిన అనంతరం మంత్రి శంకరనారాయణ స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. లక్షల మంది మహిళలకు ఆర్థిక భరోసానిస్తున్న వైఎస్సార్ చేయూత రెండవ విడత కార్యక్రమం నిర్వహించుకోవడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెలలో ఇప్పటికే జగనన్న ఇళ్ల నిర్మాణ పనులకు శంకు స్థాపన, జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, వాహన మిత్ర ద్వారా డ్రైవర్లకు నగదు బదిలీ వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని.. అదే కోవలో నేడు వైఎస్సార్ చేయూత రెండవ విడత అందించామన్నారు. చేయూత సొమ్ము వృథా కాకుండా ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళలకు మల్టీ నేషనల్ కంపెనీల ద్వారా హోల్ సేల్ ధరలకే ఉత్పత్తులు అందించి లాభసాటి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుగోలదనే ఆలోచనతో జగనన్న సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు.
జిల్లా మహిళలు చేయూత మరియు ఇతర పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి అందుతున్న సొమ్మును ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వినియోగిస్తున్నారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ తెలిపారు. ఎక్కువ మంది మహిళలు పశువుల పెంపకం, పాడి పరిశ్రమ, కిరాణా షాపులు, గార్మెంట్స్ షాపుల నిర్వహణ వంటి పనులు చేపడుతున్నారన్నారు. ఇవేగాక మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకు వస్తే బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందిస్తున్నామన్నారు.
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు ఇంట్లో మగవారి ఆదాయానికి మహిళల ఆదాయం కూడా తోడైతే ఆ ఇంటికి ఆర్థిక ఇబ్బందులు ఉండవనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ చేయూత వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. మహిళలు సంతోషంగా ఉన్నపుడే కుటుంబాలు సంతోషంగా, రాష్ట్రం సుభిక్షంగా ఉండగలదన్నారు. కరోనా ఆర్థిక కష్టాలలోనూ అద్భుతమైన పథకాలను అందిస్తున్న ఆదర్శ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కదిరి ఎమ్మెల్యే డా.సిద్దారెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటల మనిషి కాదని చేతల మనిషని ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో అనంతపురం కలెక్టరేట్ నుంచి ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకట్రామి రెడ్డి, దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, మెప్మా పీడీ రమణా రెడ్డి మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.