గుంటూరు జిల్లాలో వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులు 2,10,529 మంది అక్కచెల్లమ్మలకు రూ.394.74 కోట్ల చెక్కును రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ లబ్ధిదారులకు అందించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లమ్మలకు ప్రతి సంవత్సరం రూ.18,750 చొప్పున ఐదు సంవత్సరాలలో రూ.75,000 ఆర్ధిక సహాయం అందించేందుకు వైఎస్సార్ చేయుత పథకంకు శ్రీకారం చుట్టారన్నారు. చేయూత పథకం ద్వారా ఆదాయం పెంచుకొని మహిళలు ఆర్ధికంగా స్థిరపడటం కోసం పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం, చిరు వ్యాపారులు నిర్వహించుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నారన్నారు.
జిల్లాలో 2,10,529 మంది అక్కచెల్లమ్మలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది రూ.394.74 కోట్లు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేయటం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న మహిళలపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుందని, పిల్లల పెళ్ళిళ్ళులకు ఇతర ఆర్ధిక అవసరాలు తీర్చాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్నారు. ఆర్ధిక అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయకుండా ఉండేందుకు వారికి వైఎస్సార్ చేయుత పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు. మహిళలకు సంక్షేమ పథకాలతో పాటు సాధికారికత కోసం నామినేటడ్ పదవులలో 50 శాతంకు మించి రిజర్వేషన్లు కల్పించి నిజమైన మహిళా సాధికారితను ముఖ్యమంత్రి చేసి చూపించారన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలకు పెన్షను ఇస్తునే వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఆసరా, సున్నావడ్డీ, చేయూత తదితర సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి కుటుంబంలోని మహిళకు రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలోను అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. కుటుంబంలో భార్యలనే భర్తలు నగదు అడిగే పరిస్థితిని తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి మహిళా లోకం మొత్తం ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర జరిగిన ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారని, బాదితురాలికి రూ.5 లక్షల నగదును ప్రకటించి జిల్లా కలెక్టర్ ద్వారా వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమంతో పాటు రక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. మహిళ ఆనందంగా ఉంటేనే కుటుంబం ఆనందంగా ఉంటుందని, తద్వారా సమాజం, రాష్ట్రం ఆనందంగా ఉంటుందని, మహిళలకు అవసరమైన సంక్షేమ, రక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి మహిళల తరుపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.