థర్డ్ వేవ్ ను సమిష్టిగా ఎదుర్కోవాలి..
Ens Balu
2
Kakinada
2021-06-22 14:22:02
కోవిడ్ 3వ దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేదుకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో కోవిడ్ మూడో దశ ప్రభావం, మూడోదశకు అనుగుణంగా జిజిహెచ్ లో ఏర్పాటు చేయవలసిన సదుపాయాలపై జిజిహెచ్ కోవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి జి.సూర్య ప్రవీణ్ చాంద్ తో కలిసి జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మూడవ దశను పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇప్పటినుంచే మూడవ దశ పై అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. జిజిహెచ్ ఈఎన్ టి బ్లాక్ వద్ద పీడియాట్రిక్ విభాగానికి సంబంధించి 20 పడకలతో కూడిన ట్రాయాజ్, 200 పడకలతో ప్రత్యేకమైన పీడియాట్రిక్ వార్డు, ఐసియు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, పీడియాట్రిక్ వెంటిలేటర్స్ , ఈసీజీ పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. ఈ సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు ఆరోగ్యశ్రీ, ఆసుపత్రి సీఎస్ఆర్, కోవిడ్ నిధుల నుంచి కేటాయించాలన్నారు. జిల్లాలో కోవిడ్ రెండవ దశ తగ్గుముఖం పట్టినప్పటికీ అలక్ష్యం వహించకుండా వైద్య సేవలు అందించారన్నారు. జీజీహెచ్ లో 369 కోవిడ్ యాక్టివ్ కేసులు,126 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి,ఆర్ఎమ్ వో లు డా. గిరిధర్, డా. అనిత,సిఎస్ఆర్ఎమ్ వో డా. పద్మ శశిధర్, పీడియాట్రిక్ విభాగ అధిపతులు, ఇతర వైద్య అధికారులు హాజరయ్యారు.