దివ్యాంగుల కోసం ఆధార్ నమోదు..


Ens Balu
1
గుంటూరు
2021-06-22 15:31:55

గుంటూరు జిల్లాలో దివ్యాంగులకు ఆధార్ కార్డు నమోదు, కోవిడ్–19 వ్యాక్సినేషన్  ఇంటి వద్దకే వెళ్ళి అందించేందుకు అవసరమైన ప్రణాళికలు వెంటనే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతితో కలసి దివ్యాంగులకు అధార్ కార్డు నమోదు, వ్యాక్సినేషన్పై రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి కావటం తో ఆధార్ కార్డు నమోదు చేసుకోలేని దివ్యాంగులుకు సంక్షేమ పథకాలు అందించటంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా మానసిక దివ్యాంగులు, నూరు శాతం వైకల్యంతో మంచానికే పరిమితమైన దివ్యాంగులను ఆధార్ నమోదు కేంద్రాలకు తీసుకువెళ్ళటానికి కుటుంబసభ్యులు చాలా కష్టాలు పడుతున్నారన్నారు. అటువంటి వారికి ఇంటి వద్దకే వెళ్ళి మొబైల్ టీంల ద్వారా ఆధార్ కార్డు నమోదుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించనున్నామన్నారు. 

మంచానికే పరిమితమైన దివ్యాంగులకు కోవిడ్–19 వ్యాక్సిన్ను ఇంటి వద్దకే వెళ్ళి అందించనున్నామన్నారు.  సచివాలయంలోని వాలంటీర్లు తమ పరిధిలోని దివ్యాంగుల వివరాలను సేకరించి సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ల సెక్రటరీలకు అందించాలన్నారు. గ్రామ సచివాలయాలకు అందిన వివరాలను ఎంపీడీవోలు జిల్లా పరిషత్ సీఈవోకు, వార్డు సచివాలయాలకు అందిన వివరాలను మున్సిపల్ కమిషనర్లు ఆర్డీఎంఏకు పంపించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు వారీగా అందిన వివరాలకు అనుగుణంగా దివ్యాంగులకు  ఇంటి వద్దకే వెళ్ళి ఆధార్ నమోదు కోసం రూట్ ప్లాన్ను తయారు చేయాలన్నారు.  ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు నమోదు కోసం ఐరీష్, బయెమెట్రీక్ డివైజ్లతో పాటు కంప్యూటర్, ప్రింటర్ ఇద్దరు టెక్నిషీయన్లు ఒక వాహనంలో  మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రూట్ ప్లాన్ రూపొందించిన వెంటనే సచివాలయాలు వారీగా ముందుగా సమాచారం అందించి మొబైల్ టీంలు దివ్యాంగుల ఇళ్ళకు వెళ్ళి ఆధార్ కార్డు నమోదు చేస్తారని తెలిపారు. కోవిడ్ –19 వ్యాక్సినేషన్ను 108 వాహనాల ద్వారా దివ్యాంగుల ఇంటికే వెళ్ళి అందిస్తారన్నారు.

టెలికాన్ఫరెన్సులో సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో చైతన్య, మున్సిపల్ ఆర్డీ శ్రీనివాసులు, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, పాల్గొన్నారు.