రూ. 737.72 లక్షలు కేటాయింపు..
Ens Balu
3
శ్రీకాకుళం
2021-06-22 15:33:05
ప్రధానమంత్రి మత్స్యశాఖ సంపద యోజన పథకం(2020-21) క్రింద చేపల తలసరి వినియోగం పెంపొందించేందుకు వివిధ యూనిట్ల స్థాపనకై జిల్లాకు రూ.737.72 లక్షలు కేటాయించినట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన క్రింద లైవ్ ఫిష్ , ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటేడ్ అండ్ కుక్డ్ ప్రోడక్ట్స్ రిటైల్ అమ్మకం,స్నాక్స్,ఇన్ స్టంట్ కుకింగ్ ఫుడ్స్ తయారీ, ఆన్ లైన్ ద్వారా విక్రయాలు, వివిధ రకాల రిటైల్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కొరకు ఆసక్తి గల వ్యాపారవేత్తల నుంచి దరఖాస్తులను https://ematsyakar.com/efisher/retailunits ద్వారా కోరుతున్నట్లు ఆయన చెప్పారు. 2020-21 జిల్లాలో చేపల ఉత్పత్తి 1,68,870 టన్నులు కాగా, 2021-22 సం.నకు 1,70,896 టన్నులు లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో చేపల తలసరి వినియోగం పెంచి, వివిధ రకాల చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేస్తుందని అన్నారు. శ్రీకాకుళం నగర కేంద్రంగా రూ.1.27 కోట్లతో ఒక ఆక్వా హబ్ యూనిట్ ను స్థాపించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని, క్రమేపీ ప్రతి నియోజకవర్గంలో ఒక హబ్ చొప్పున ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఒక్కొక్కటి రూ.50 లక్షల వ్యయంతో జిల్లాలో ఒక వాల్యూ యాడెడ్ యూనిట్, రూ.20లక్షలతో లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఐదింటిని, రూ.10 లక్షల వ్యయంతో 10 ఫిష్ కియోస్క్ యూనిట్లను, రూ.4 లక్షల వ్యయంతో 10 ఈ-వెహికల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి రూ. 1.25 లక్షలతో మినీ ఫిష్ వెండింగ్ రిటైల్ యూనిట్లను ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించగా ప్రస్తుతం 100 యూనిట్లు మంజూరుకాబడ్డాయని, 2022 నాటికి 300 యూనిట్లను ఏర్పాటు చేయుటకు ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. పై యూనిట్ల స్థాపనకు బి.సి జనరల్ కేటగిరికి 40 శాతం, ఎస్.సి, ఎస్.టి, ఉమెన్ కేటగిరీలు 60 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు 9440814719 ఫోన్ నెంబరును సంప్రదించాలని , మినీ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ దరఖాస్తులు కొరకు మీ గ్రామ/వార్డు వాలంటీరును లేదా గ్రామ/వార్డు సచివాలయంలో కూడా సంప్రదించవచ్చని తెలిపారు. పై యూనిట్లు ఏర్పాటు చేయు వ్యాపారస్తులు ప్రభుత్వ ప్రోత్సాహాకాలు, బ్యాంకు రుణం పొందే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.