శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రభుత్వం కోవిడ్ నిబంధనల సడలింపు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కర్ఫ్యూ వేళల్లో మాత్రమే సడలింపు ఉందని గుర్తించాలని ఆయన అన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకొనుటకు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. అధికారులు కోవిడ్ నిబంధనలను అమలు చేయడంలో పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు పాటించి అనుమతి మేరకు మాత్రమే వేడుకలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పరిమితికి మించి గుమిగూడరాదని ఆయన అన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ తగ్గుముఖంలో మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించక పోతే కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ అన్నారు. మొదటి దశ చివరలో జిల్లాలో కేసులు తగ్గు ముఖం పట్టాయని, ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ నిబంధనల పట్ల అశ్రద్ద వలన వేల సంఖ్యలో కేసుల పెరుగుదల వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలందరూ మాస్క్ లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరం అయితేనే బయటకు రావాలని ఆయన సూచించారు. జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా చేయుటకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
జిల్లాలో సామర్థ్యం మేరకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, నమూనాలు విస్తృతంగా సేకరించాలని ఆయన జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కనీసం పది రోజుల పాటు రోజుకు ఆరు నుంచి ఏడు వేల వరకు నమూనాలు సేకరించాలని అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.