10వేల గ్రుహాలు ప్రారంభం కావాలి..


Ens Balu
1
Markapuram
2021-06-23 13:08:44

జగనన్న కాలనీలలో ఈ నెలాఖరులోగా పదివేల గృహ నిర్మాణాల ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై బుధవారం మార్కాపురం ప్రెస్ క్లబ్ లో మార్కాపురం డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. అధికారులు కష్టపడి మిషన్ మోడ్ లో  పనిచేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. గ్రామస్థాయి నుంచి  ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. జిల్లాకు చెడ్డ పేరు రానివ్వద్దని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక క్యాంపైన్ లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చిస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలలో పురోగతి సాధించలేకపోతే ఎలా అంటూ అధికారులను కలెక్టర్ నిలదీశారు. మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాల సాధనకు అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. జగనన్న కాలనీలలో లబ్ధిదారులను ప్రోత్సహించి గృహాలు నిర్మించుకునేలా చైతన్యపరచాలి అన్నారు.

           జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పనుల ప్రారంభంలో అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రస్తుతం మార్కాపురం డివిజన్లో 12 క్లస్టర్లలో లోని లేఅవుట్లలో భూమి సమస్య పరిష్కారం కాలేదన్నారు. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జియో ట్యాగింగ్, ఆధార్ అనుసంధానం, ఆన్లైన్ నమోదు, మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో 70 శాతం ఉందన్నారు. జూలై 4వ తేదీ నాటికి నూరు శాతం గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అర్ధవీడు మండలంలో గృహాల నిర్మాణం గ్రౌండింగ్ 4%, దోర్నాల మండలంలో 2 శాతం, పుల్లల చెరువు మండలంలో ఏడు శాతం, మార్కాపురం పట్టణంలో 71 గృహాలు మాత్రమే గ్రౌండింగ్ జరగడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా మూడు వేల గృహాల నిర్మాణం పనులు ప్రారంభం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందన్నారు. అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీలలో జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో  మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను  ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు. 

మంజూరైన గృహాల నిర్మాణ పనులు ప్రారంభించకుండా అభ్యంతరాలు వ్యక్తం చేసే లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. వారి నుంచి అనుమతి పత్రం తీసుకున్న తదుపరి నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆ స్థలాలు కేటాయించడానికి అధికారులు పరిశీలించాలన్నారు. కోవిడ్ కేసులు జిల్లాలో నేటికి పూర్తిగా తగ్గలేదని జాగ్రత్తలు పాటిస్తూనే అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.  సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు (ఆర్.బి అండ్ ఆర్ ) జె. వెంకట మురళి,  కె.ఎస్. విశ్వనాథన్, గృహ నిర్మాణ శాఖ పీడీ సాయినాథ్ కుమార్, డ్వామా పి డి శీనా రెడ్డి, పీ ఆర్ ఎస్ఈ కొండయ్య, ఉప కలెక్టర్ గ్లోరియా, ట్రాన్స్కో ఎస్ సి, మార్కాపురం ఆర్డీవో ఎం.వి.శేషి రెడ్డి, తహసిల్దార్లు, ఎం డి వో లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.