ఇళ్ల నిర్మాణాలు లక్ష్యాలు చేరుకోవాలి..


Ens Balu
3
Guntur
2021-06-23 14:16:21

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు -పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు.  బుధవారం జిల్లాలోని వేమూరు మండల పరిషత్తు కార్యాలయంలో నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, వేమూరు శాసన సభ్యులు మేరుగ నాగార్జునతో కలసి  సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వేమూరు, చుండూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కార్యక్రమం పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని  అన్నీ నియోజకవర్గాల వారిగా  చూస్తే వేమూరు నియోజకవర్గంలో పనుల్లో వేగం పెంచాల్సి వుందన్నారు.  నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళ పధకం పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా త్వరితగతిన పేదలకు ఇళ్ళు నిర్మించేలా అవసరమైతే  స్వచ్ఛంధ సంస్థలు, ఆయా గ్రామ సర్పంచ్ ల సహకారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.    అనంతరం వేమూరు నియోజవర్గానికి సంబంధించి నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పధకం ఇళ్ళ నిర్మాణాలలో ఏర్పాటు చేస్తున్న మౌళిక వసతుల  వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

 ఐదు మండలాల్లో 169 లే అవుట్లు ఏర్పాటు అయినట్లు అధికారులు నివేదిక ద్వారా వెల్లడించారు. ఇళ్ళ స్థలాల కోసం 11,003 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 1366 మందికి ఇళ్ళ స్థలాలున్నాయని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 12369 మంది లబ్దిదారులు ఇళ్ళు నిర్మించుకునేందుకు అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఇందులో గ్రౌండింగ్ పూర్తి అయిన ఇళ్ళ స్థలాలు 1432  ఉండగా, 247 మంది సొంత స్థలాలు వుండి ఇళ్ళు నిర్మించుకునేందుకు సమ్మతి తెలియజేసినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.  తొలిదశలో 1679 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళు నిర్మించుకునేందుకు అనుమతి మంజూరు చేసినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణు గోపాలరావు జిల్లా కలెక్టర్ కు వివరించారు. మొత్తం 169 లే అవుట్లకు గాను మౌళిక వసతులకు సంబంధించి ఇప్పటి వరకు ఐదు మండలాల్లో 18 లే అవుట్లలో బోర్లు వేయడం జరిగిందన్నారు. 119 చోట్ల బోర్లు వేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. మరో 26 చోట్ల పనులు ప్రారంభంకావలసి వుందన్నారు. విద్యుత్ లైన్లకు సంబంధించి  14 లే అవుట్లలో విద్యుత్ లైన్ల కార్యక్రమం పూర్తి అయిందన్నారు.  మరో 63 చోట్ల పనులు కొనసాగుతున్నాయని, 78 చోట్ల త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.

 చుండూరు మండలంలోని 35 లే అవుట్ల లో విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం లేదని అధికారులు వివరించారు. ఫ్లాట్ల మ్యాపింగ్ కార్యక్రమం 12344 చోట్ల పూర్తి అయిందని, మరో 25 చోట్ల మ్యాపింగ్ చేయాల్సి వుందన్నారు.  12 126 ఫ్లాట్ల కు జియోట్యాగింగ్ పూర్తికాగా, 243 ఇళ్ళ స్థలాలకు జియోట్యాగింగ్ చేయాల్సి వుందన్నారు. 11630 ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి కాగా, 739 స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వుందన్నారు. 12 369 మంది లబ్దిదారులకు  ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం జాబ్ కార్డ్ లను అనుసంధానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కు తెలియజేసారు.  

  వేమూరు నియోజకవర్గ  శాసన సభ్యులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో ఎక్కువ లోతట్టు గ్రామాలు వేమూరు నియోజకవర్గంలోనే ఎక్కువగా వున్నాయన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళు నిర్మిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణు గోపాలరావు, తదితర అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఇళ్ళ స్థలాలను లోతట్టు, మాగాణి ప్రాంతాలలో జగనన్న కాలనీ లే అవుట్లు ఏర్పాటు చేయడం వలన మెరక కోసం మట్టిని ఏర్పాటు చేసుకోవలసిన పరిస్థితి వుందన్నారు.  

దీనిపై స్పందింన జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాలలో వున్న కాలనీ లలో మౌళిక ఏర్పాటుతో పాటు ఇళ్ళ స్థలాలకు అవసరమైన మెరక మట్టిని లబ్దిదారులకు అందించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా వేమూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీ లు నిర్మించి పెదలందరికి మేలు చేస్తామని శాసన సభ్యులు పేర్కొన్నారు.  సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  పేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మూడు విధానాల్లో ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమం వేగవంతం చేయాలని కోరారు.
  
  సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ క్రొత్తగా ఎంపిక అయిన సర్పంచ్ లను మాట్లాడాలని కోరారు. దీంతో పలువురు సర్పంచ్ లు నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు నిర్మాణాలలో ఎదురు అవుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. తదుపరి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియా వారితో మాట్లాడుతూ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళ పధకం పురోగతి వివరాలను  వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఎస్.ఈ నతానియేల్, తెనాలి ఇన్ చార్జ్ ఆర్ డి ఓ భాస్కర రెడ్డి, తెనాలి డివిజన్ మండలాల తహశీల్దార్లు, యంపిడిఓ లు, విద్యుత్, గృహ నిర్మాణ, పంచాయితీ రాజ్, ఏ.పి ఫైబర్ నెట్ శాఖాధికారులు, సచివాలయాల కార్యదర్శులు,  వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.