తాగు, సాగు నీటి సరఫరాపై అవసరమైన ప్రణాళికలను త్వరితగతిన సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హెచ్ఎల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్, మైనర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యుఎస్, పబ్లిక్ హెల్త్, ఏపీఎస్ఐడిసి శాఖల అధికారులతో ఇరిగేషన్ మరియు తాగునీటి సరఫరా పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఎల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్ కింద వివిధ రిజర్వాయర్ లకు, ప్రాజెక్టులకు, ట్యాoకులకు తాగు, సాగు నీటి సరఫరా చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు, ట్యాoకులకు ఎంత నీరు ఇవ్వాల్సి ఉంటుంది అనేది చూసుకుని కేటాయించిన లక్ష్యం మేరకు నీటి సరఫరాను చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు ఎన్ని టిఎంసిల నీరు కేటాయించారు అనేదానికి అనుగుణంగా నీటి సరఫరా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆయా బ్రాంచ్ కెనాల్స్ కింద ఆయకట్టుకు అవసరమైన నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎల్సీ అధికారులు సమన్వయం చేసుకుని ఎన్ని ట్యాంకులకు తాగు నీరు సరఫరా చేస్తారు అనేది ముందుగానే నిర్ణయించుకోవాలన్నారు. హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మిగిలిన ఆధునీకరణ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఆర్డబ్ల్యూఎస్ కింద జగనన్న హౌసింగ్ కాలనీలలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల పనులు పూర్తిచేసి ఈనెల 31వ తేదీ లోపు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రతిరోజు తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గత ఏడాది నవంబర్ నెలలో నిర్వహించిన డిఆర్సి సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జూలై నెలలో మరోసారి ఇరిగేషన్ మరియు తాగునీటి సరఫరా పై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అన్ని రకాల వివరాలతో సమావేశానికి హాజరు కావాలన్నారు. అలాగే త్వరలో నిర్వహించే డిఆర్సి సమావేశానికి అన్ని విధాలా సమగ్ర సమాచారంతో హాజరయ్యేలా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా హెచ్ఎల్సి కింద తుంగభద్ర డ్యాం గురించి, కాలువలు, ఆయకట్టు వివరాలు, నీటి సరఫరా, నీటి ప్రవాహం, రిజర్వాయర్ల వివరాలు, తదితర వాటిని జిల్లా కలెక్టర్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. హెచ్ఎన్ఎస్ఎస్ కింద జీడిపల్లి, పేరూరు, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్ లు, పుంగనూరు, మడకశిర బ్రాంచ్ కెనాల్ గురించి, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1, ఫేజ్ 2 కింద చేపట్టిన పనుల వివరాలను, హెచ్ఎన్ఎస్ఎస్ కింద నీటి సరఫరా ఎంత జరుగుతోంది, ఎప్పుడు నీటి విడుదల చేస్తారు, జిల్లాకు ఈ ఏడాది ఎన్ని టీఎంసీలు కేటాయించారు తదితర వివరాలను ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న ప్రాజెక్టుల వివరాలు, పబ్లిక్ హెల్త్ కింద చేపట్టిన పనులు, నీటి సరఫరా వివరాలు, ఏపీఎస్ఐడిసి కింద చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఆయా శాఖల కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ వెంకటరమణ, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సతీష్ చంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, ఏపీఎస్ఐడిసి డీఈఈ అనురాధ, ఈఈ రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.