కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)లో సేకరించిన 2,180 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన జీవో నెం.12 మేరకు తిరిగి రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసేందుకు కృషిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వలవన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కాకినాడలోని జీఆర్‌టీలో కాకినాడ సెజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చే కార్యక్రమంపై కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, రెవెన్యూ, పరిశ్రమలు, సెజ్ తదితర విభాగాల అధికారులతో ఆర్.కరికాల వలవన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరికాల వలవన్ మాట్లాడుతూ కేటగిరీ-1లో 1357.18 ఎకరాల మేర ఎవరి భూములను వారికి ఇవ్వాల్సి ఉండగా, కేటగిరీ-2లో 821.61 ఎకరాల ప్రత్యామ్నాయ భూములను ఇవ్వాల్సి ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరితగతిన రైతుల పేరిట భూముల రిజిస్ట్రేషన్‌ను పూర్తిచేసేందుకు కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో చేపట్టిన ముందస్తు సర్వేను పూర్తిచేయాలని, భూ యజమానులు మరణించిన కేసులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు.
కేటగిరీ-1లో 1,341 మంది రైతులకు, కేటగిరీ-2లో 1,131 మంది రైతులకు భూములను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని నిరాటంకంగా యుద్ధప్రాతిపదికన విజయవంతంగా పూర్తిచేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా రెవెన్యూ, పరిశ్రమలు, సర్వే తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో ఏర్పాటుచేసిన బృందాలు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయని, అవసరమైతే మరిన్ని బృందాలను ఏర్పాటు చేయాలని, విలేజ్ సర్వేయర్ల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే అధికారులు సమన్వయంతో వాటిని పరిష్కరించి, కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని ఆర్.కరికాల వలవన్ సూచించారు. సమావేశంలో కాకినాడ ఆర్‌డీవో, పెద్దాపురం ఇన్‌ఛార్జ్ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కేపీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.