రుణాలు సత్వరం మంజూరుచేయాలి..


Ens Balu
2
Guntur
2021-06-23 14:36:47

ప్రభుత్వ పథకాలకు బ్యాంకు లింకేజీ రుణాలు వేగవంతంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ జూమ్ ద్వారా నిర్వహించిన  జిల్లా కన్సల్టెటివ్ కమిటీ మీటింగ్ (డీసీసీ), జిల్లా స్థాయి రివ్యూ కమిటీ మీటింగ్(డీఎల్ఆర్సీ)లో పాల్గొన్నారు. సమావేశంలో 2021–22 ఆర్దిక సంవత్సరానికి సంబంధించి రూ.31,500 కోట్లతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ వివేక్ యాదవ్  విడుదల చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రైతులకు,  కౌలు రైతులకు వ్యవసాయ పంటరుణాలు బ్యాంకర్లు వెంటనే ఇచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పేదరికం నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి  కార్యక్రమాలకు బ్యాంకులు ప్రాధన్యత ఇవ్వాలన్నారు. మండల స్థాయిలోని బ్యాంకు మిత్రాలను ఆర్బీకేలకు అనుసంధానం చేసి రైతులకు అవసరమైన రుణాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు డ్వాక్వా సంఘాల అర్హత ఉన్న మేరకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు.

 అమూల్ ప్రాజెక్టు అమలు చేస్తున్న గ్రామాలలోని స్వయంసహాయక గ్రూప్ సభ్యులకు పాడి పశువులు కొనుగోలుకు ఎస్హెచ్జీ రుణాలు మంజూరు చేయాలన్నారు. పశు కిసాన్ కార్డుల ద్వారా పశువుల కొనుగోలుకు రుణాలు మంజూరు అయ్యేలా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  దేశంలోనే వాణిజ్య పంటలకు గుంటూరు రాజధానిగా ఉందని, దానికి తగిన విధంగా బ్యాంకులు వ్యవసాయ, అనుబంధరంగాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రుణాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకర్లు పేదలకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ఓపెన్ చేసి అందరికి బ్యాంకులు అందుబాటులో ఉండాలన్నారు.  కౌలు రైతులకు విరివిగా పంట రుణాలు అందించేందుకు బ్యాంక్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజరు రాంబాబు మాట్లాడుతూ 2021–22 రుణ వార్షిక ప్రణాళిక కేటాయింపులను వివరిస్తూ వ్యవసాయ రంగానికి రూ.19వేల కోట్లు, ప్రాధాన్యతా  రంగాలకు రూ.26 వేల 500 కోట్లు కేటాయించామన్నారు. గత ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16,400 కోట్లుకు గాను, రూ.16,196.75 కోట్లు పంపిణీ చేసి 99శాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు.
 
సమావేశంలో సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఎఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ డీజీఎం, డీఎల్ఆర్సీ కన్వీనర్ రవి కుమార్, నాబార్డు డీడీఎం కార్తిక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ టీ కామేశ్వరరావు, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.