నెలిమర్ల జ్యూట్ మిల్ తెరిపించండి..


Ens Balu
2
Vizianagaram
2021-06-23 15:30:20

నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్లును తెరిచేందుకు ఇరు వ‌ర్గాలూ ఒక మెట్టు దిగి ప్ర‌య‌త్నించాల‌ని,  యాజ‌మాన్యాన్ని, కార్మిక నాయ‌క‌త్వాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు కోరారు. కార్మికులు న‌ష్ట‌పోకుండా మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఆలోచించాల‌ని సూచించారు. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం మ‌రో విడ‌త చ‌ర్చ‌లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే మూత‌బ‌డ్డ నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్లును తిరిగి తెరిపించేందుకు, జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు స‌మ‌క్షంలో  క‌లెక్ట‌రేట్‌లో యాజ‌మాన్య ప్ర‌తినిధులు, కార్మిక నాయ‌కులతో బుధ‌వారం చ‌ర్చ‌లు జ‌రిగాయి. ముందుగా డిప్యుటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ లేబ‌ర్ సిహెచ్ పురుషోత్తం మాట్లాడుతూ, ఎటువంటి నోటీసు ఇవ్వ‌కుండానే జ్యూట్‌మిల్లు యాజ‌మాన్యం ఆక‌స్మాత్తుగా వ‌ర్క్‌ స‌స్పెన్ష‌న్‌కు పాల్ప‌డింద‌ని చెప్పారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం 90 రోజుల ముందుగా నోటీసు ఇచ్చి, స‌హేతుక కార‌ణాలు చూపిన త‌రువాత, అనుమ‌తి తీసుకొని మాత్ర‌మే మిల్లు మూయ‌డానికి అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

             నెల్లిమ‌ర్ల జ్యూట్‌మిల్స్‌ కంపెనీ లిమిటెడ్ సిఇఓ ఎంవి రావు మాట్లాడుతూ, తీవ్ర ఆర్థిక న‌ష్టం కార‌ణంగా మిల్లును మూసివేయాల్సి వ‌చ్చింద‌ని, ఇలాంటి ప‌రిస్థితిలో ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ప్ర‌దానంగా కార్మికులు త‌ర‌చూ విధుల‌కు గైర్హాజ‌రు కావ‌డం, ఉత్ప‌త్తి ప‌డిపోయి, ఖ‌ర్చు పెరిగిపోవ‌డంతో, మిల్లులో ఉత్ప‌త్తిని ఆపివేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ఉత్ప‌త్తి 50శాతం ప‌డిపోయిన‌ప్ప‌టికీ, నిర్వ‌హ‌ణా వ్య‌యం మాత్రం యదాత‌థ స్థితిలోనే ఉంద‌ని చెప్పారు. కార్మికులు ఒక పూట విధుల‌కు హాజ‌రై, మ‌రోపూట రాక‌పోవ‌డం, నెల‌లో ఎక్కువ‌సార్లు గైర్హాజ‌రు కావ‌డం వ‌ల్ల స‌గ‌టు హాజ‌రు శాతం త‌క్కువ‌గా ఉండి, ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా ప‌డిపోయింద‌ని తెలిపారు. ఇక్క‌డ ముడిస‌రుకు దొర‌క‌క‌పోవ‌డం వ‌ల్ల, ట‌న్నుకు అద‌నంగా రూ.3వేలు చెల్లించి మ‌రీ బెంగాల్ నుంచి తీసుకువ‌స్తున్నామ‌ని, తాము కూడా మిల్లును న‌డప‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు. త‌మ‌ది సిక్ ఇండ‌స్ట్రీగా బిఎఫ్ఆర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, మిల్లును న‌డుపుతున్నామ‌ని అన్నారు. త‌మ ష‌ర‌తుల ప‌త్రాన్ని జెసికి, కార్మికుల‌కు అంద‌జేశారు.

            శ్రామిక సంఘం అధ్య‌క్షులు ప‌తివాడ అప్పారావు మాట్లాడుతూ, యాజ‌మాన్యం వాద‌న‌ను వ్య‌తిరేకించారు. ఎలాగైనా మిల్లును న‌డిపించాల‌న్న ల‌క్ష్యంతో, ప‌లు అంశాల్లో రాజీప‌డి మ‌రీ, యాజ‌మాన్యానికి స‌హ‌క‌రిస్తున్నామ‌ని చెప్పారు. కార్మికులు స‌క్రంగా విధులకు రావ‌డం లేద‌న్న వాద‌న‌ను ఖండించారు. పాత‌కాలం నాటి మిష‌న్లు, నాశిర‌కం ముడిస‌రుకుల కార‌ణంగానే ఉత్ప‌త్తి త‌గ్గిపోయింద‌ని, ఆ నెపాన్నికార్మికుల‌పై నెట్ట‌డం స‌రికాద‌ని అన్నారు. క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో కూడా  ఎన్నో వ్య‌య ప్ర‌యాశ‌ల‌కోర్చి, కార్మికులు విధుల‌కు హాజ‌ర‌య్యార‌ని చెప్పారు. కార్మికులనుంచి వ‌సూలు చేసిన పిఎఫ్ సొమ్మును, తాను చెల్లించ‌వ‌ల‌సిన షేర్‌ను కూడా యాజ‌మాన్యం దీర్ఘ‌కాలంగా క‌ట్ట‌లేద‌ని చెప్పారు. అలాగే గ్రాడ్యుటీ చెల్లించ‌లేద‌ని, ఇఎస్ఐ సౌక‌ర్యం కూడా అంద‌డం లేద‌ని, చివ‌ర‌కు కార్మికులు యాజ‌మాన్యానికి  జీతాల‌నుంచి అప్పుగా ఇచ్చిన‌ సొమ్ము కూడా, తిరిగి చెల్లించ‌డం లేద‌ని చెప్పారు. స‌గ‌టున కార్మికులకు 16 రోజుల ప‌నిమాత్ర‌మే దొరుకుతోంద‌ని, దీంతో ఆ కుటుంబాలు ఎలా బ్ర‌తుకుతాయ‌ని ప్ర‌శ్నించారు.

             చివ‌రిగా జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు మాట్లాడుతూ, ఇరువ‌ర్గాలూ ఒక మెట్టు దిగిన‌ప్పుడు మాత్ర‌మే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. యాజ‌మాన్యం, కార్మికులు త‌మ డిమాండ్ల‌పై చ‌ర్చించి, మ‌ధ్యేమార్గంగా ఒక‌ అంగీకారానికి రావాల‌ని సూచించారు. మిల్లును బ్ర‌తికించే బాధ్య‌త ఇరువ‌ర్గాల‌పైనా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.  జ్యూట్‌మిల్లుల ప‌రిశ్ర‌మ ఇప్ప‌టికే కుదేలై ఉంద‌ని, చాలా మిల్లులు మూత‌బ‌డి ఉన్నాయ‌ని అన్నారు. అందువ‌ల్ల వాస్త‌వ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని, స‌మ‌స్య‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని చెప్పారు. ముఖ్యంగా కార్మికుల ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకొని, యాజ‌మాన్యం విశాల హృద‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. మిల్లును న‌డ‌ప‌డ‌మే ఇరువ‌ర్గాల‌కు శ్రేయోదాయ‌క‌మ‌ని పేర్కొన్నారు. వారం రోజుల్లోపే మ‌రో సారి, ఇరువ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు ఏర్పాటు చేస్తామ‌ని జెసి వెంక‌ట‌రావు తెలిపారు.

             ఈ చ‌ర్చ‌ల్లో ఏసిఎల్ ర‌మాదేవి, ఏఎల్ఓ అరుణ‌కుమారి, మిల్లు యాజ‌మాన్యం త‌ర‌పున జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పికె ఘోష్‌, క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ పంక‌జ్ రెడ్డి, శ్రామిక సంఘం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ వెంక‌ట గోవింద‌రావు,  కార్య‌ద‌ర్శి మ‌ద్దిలి వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.