స్వచ్ఛ సంకల్పం విజయవంతం కావాలి..


Ens Balu
5
Guntur
2021-06-24 14:52:31

గ్రామాలను పరిశుభ్రంగా, సుందరంగా  తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.  గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, కలక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి ) పి. ప్రశాంతి  గ్రామాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ నిర్వహణపై యంపిడిఓ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ద్యాన్ని మెరుగుపరచి వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించేందుకు జూలై 8 వ తేది నుండి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం వంద రోజులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.  ప్రతి గ్రామంలోను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షేడ్స్ ను వినియోగంలోకి తీసుకురావాలన్నారు.  షేడ్స్ లేని గ్రామాల్లో నూతన షెడ్ల నిర్మాణానికి, మరమ్మత్తులు ఉన్న చోట మరమ్మత్తులకు ఉపాధి హామీ పధకం క్రింద ప్రతిపాదనలు అందించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.  ప్రతి గ్రామంలోను డోర్ టు డోర్ తడి – పొడి చెత్త వేరుచేసి సేకరించేందుకు గ్రీన్ అంబాసిడర్లను, పుష్ కార్టులను సిద్దం చేసుకోవాలన్నారు.  సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలించిన  వ్యర్ధాల నుండి ప్లాస్టిక్ ను, ఇతర ముడి పదార్ధాలను  పూర్తిస్థాయిలో వేరు చేయాలన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ శివారు ఓబులునాయుడుపాలెం లో ఉన్న జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు సమీప గ్రామాల్లోని వ్యర్ధాలను తరలించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  పల్నాడు ప్రాంతాలలోని గ్రామాలు సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ లకు ప్లాస్టిక్ వ్యర్ధాలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  జగనన్న స్వచ్ఛ సంకల్పం లో భాగంగా వంద రోజులు నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక ప్రజలతో పాటు, స్వచ్చంద సేవా సంస్థలను భాగస్వామ్యులను  చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.  గ్రామాల్లోని హాట్  స్పాట్స్  శుభ్రం చేసి మొక్కలు నాటాలని, కార్యక్రమాలు చేపట్టక ముందు ఉన్న పరిస్థితులు, అభివృద్ధి చేసిన పరిస్థితులు నాడు  – నేడు నివేదికలు ఫొటోలతో సహా రికార్డు చేయాలన్నారు.  ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న పారిశుధ్య పరిస్థితులను బట్టి ఎ ప్లస్, ఎ, బి, సి, డి, ఇ కేటగిరీ లుగా వర్గీకరించడం జరిగిందని, ఇ కేటగిరీ లో ఉన్న గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా మెరుగుపడేలా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలన్నారు.  స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం  అమలుకు, పర్యవేక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు జిల్లా స్థాయిలో సీనియర్ అధికారులు, నిపుణులతో ప్రత్యేకంగా కమిటీ ని ఏర్పాటు చేయాలన్నారు.  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం పూర్తి అయ్యే నాటికి గ్రామాల్లో పారిశుద్ధ్యంతో పాటు మురుగునీటి పారుదల, సురక్షిత మంచినీటి సరఫరాలో స్పష్టమైన మార్పులు కనిపించేలా గ్రామాలూ ఎ ప్లస్ కేటగిరీ లో ఉండేలా  అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.  

      సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి ) పి. ప్రశాంతి మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుకు గత నెల రోజుల నుండి  స్వచ్ఛ సన్నాహక  కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గ్రామ సర్పంచ్ లకు, సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.  కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన మెన్, మెటీరియల్, మిషనరీ లను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రతి గ్రామంలోను   యంపిడిఓ లు సమకూర్చుకునేల చర్యలు తీసుకోవాలన్నారు.   గ్రామాల్లో  ప్రతి ఇంటిలో వ్యర్ధాలను వేరుచేసి గ్రీన్ అంబాసిడర్లకు అందించేలా వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం వంద రోజుల కార్యక్రమ నిర్వహణలో గ్రామ వాలంటీర్లు, గ్రీన్ అంబాసిడర్లు, క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు, పంచాయితీ సెక్రటరీలు, మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను వివరించారు. స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన రోజు నుండి పది రోజులు రోజువారీగా చేపట్టాల్సిన  కార్యక్రమాలను తెలియజేసారు. 

  కార్యక్రమంలో జిల్లాలోని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పారిశుద్ధ్య పరిస్థితులకు అనుగుణంగా ఎ ప్లస్, ఎ, బి, సి, డి, ఇ కేటగిరీ జాబితాను కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ధి ) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) కే. శ్రీధర్ రెడ్డి, జెడ్ పి సి ఇ ఓ చైతన్య, డిపిఓ కేశవరెడ్డి, డ్వామ  పీడీ శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు.