యుద్ధప్రాతిపదికన నాడు–నేడు పనులు..


Ens Balu
3
Srikakulam
2021-06-24 14:56:10

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు–నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్ణీత సయమానికి పూర్తిచేయాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  కార్యనిర్వాహక ఇంజినీర్లు, సెక్టోరియల్ అధికారులతో నాడు–నేడు పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలో గల 38 మండలాల్లో 1,248 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పనులు జరుగుతున్నాయని, కొన్ని పాఠశాలలు తుదిదశకు చేరుకోగా, మరికొన్ని కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలిఉన్నాయని అన్నారు. వీటన్నింటిని యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టి ఈ నెల 30 నాటికి పూర్తిచేయాలని చెప్పారు.  నాడు–నేడు పనులు జరుగుతున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దగ్గర ఉండి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల నిర్వహణలో ప్రధానోపాధ్యాయులు గైర్హజరు కారదన్నారు. రెవిన్యూ డివిజన్ పరిధిలో గల ఉప విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలన్నింటిలో నాడు - నేడు పనులపై దృష్టి సారించి వాటిని పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలివున్న ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉందని, అందువలన సెక్టోరియల్ అధికారులు వాటిపై దృష్టి సారించి పనులు పూర్తిచేయాలని  సూచించారు. నాడు–నేడు పనులు జరుగుతున్న పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు  ఎప్పటికపుడు బిల్లులను ఆన్ లైన్ నందు నమోదుచేయాలని పేర్కొన్నారు.  రోజు వారీ ఖర్చులకు చెందిన నివేదికలను మండల విద్యాశాఖాధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని, ఇంజినీరింగ్ అధికారులు తమకు చెందిన బాధ్యతలను యుద్ధప్రాతిపదికన నిర్వహించి సకాలంలో పనులు పూర్తిచేయాలని, పనులు పూర్తయిన పాఠశాలల యం.బుక్ లను ఆన్ లైన్ నందు అప్ లోడ్ చేయాలని జె.సి కోరారు.  తుదిదశలో ఉన్న 174  పాఠశాలల్లోని పనులను  శనివారం నాటికి పూర్తిచేసి ఆన్ లైన్ నందు అప్ లోడ్ చేయాలని స్పష్టం చేసారు. ఎట్టిపరిస్థితిల్లోనూ  నాడు – నేడు పనులు  ఈ నెల 30 నాటికి పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి కుసుమ చంద్రకళ,  సమగ్ర శిక్ష ప్రోజెక్ట్ అధికారి  పైడి వెంకటరమణ, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష కార్యనిర్వాహక ఇంజినీర్ కె.కృష్ణయ్య, నగరపాలక సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ యస్.వెంకట్, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ మురళీ, కార్యనిర్వాహక ఇంజినీర్లు కె.సుగుణాకరరావు, భాస్కరరావు,  సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.