జూలై4న ఉచిత భోజనసాల ప్రారంభం..


Ens Balu
2
Guntur
2021-06-24 14:59:44

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కోటి రూపాయల నిధులతో రోగుల సహాయకుల కోసం నిర్మించిన  ఉచిత భోజనశాల భవనాన్ని జులై 4న  ప్రారంభిస్తున్నట్లు  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు జిల్లా ఇన్ చార్చి మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం  గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఎన్.జి.వొ లకు  కేటాయించిన  స్థలంలో రోగుల సహాయకుల కోసం నిర్మించిన భోజనశాలను   రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు జిల్లా ఇన్ చార్చి మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పరిశీలించారు. ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న ఎన్.జి.వొ ల  భవనాన్ని మంత్రి సొంత నిధులు  కోటి రూపాయలు వెచ్చించి భవనాన్ని పూర్తి చేయించారు. సుమారు 350 మంది రోగుల సహయకులకు భోజన ఏర్పాట్లు కొనసాగించేందుకు ఉపయోగ పడేలా భవనాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. పనులను పరిశీలించిన  మంత్రి వర్యులు  చెరుకువాడ శ్రీరంగనాథ రాజు  సంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు ఉచిత భోజన భవనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దెందుకు మొక్కలు ఏర్పాటు చేసి ఆరోగ్య వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రి మీడియా వారితో మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల కు  చుట్టుపక్కల ఐదు జిల్లాల నుంచి మెరుగైన వైద్యకోసం రోగులు, సహాయకులు నిత్యం రావడం జరుగుతుందని తెలిపారు. అయితే వారికి సరిపడ భోజనం కానీ, వసతులు కానీ  ఈ వైద్యశాలలో  లేకపోవడాన్ని గమనించామన్నారు.  ఆరునెలల క్రితం భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ భోజనశాలలో రోగుల సహాయకులకు రెండు పూటల నాణ్యమైన సరిపడా ఆహారాన్ని ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.  రోగుల సహాయకులకు భోజనం పెట్టేందుకు దాతృత్వం కలిగిన తన మిత్ర బృందం  మధురాన్నం ట్రస్ట్ ముందుకు రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నానన్నారు.  ఈ కార్యక్రమం ద్వారా రోజుకు నాలుగు వేల మందికి ఉచిత భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తాము చేసే ఈ కార్యక్రమానికి  సహకారం అందిస్తే వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రతి రోజు రోగుల సహాయకుల తో పాటు భోజనం తయారుచేసే సిబ్బందికి రూ. లక్ష మేర ఖర్చు అవుతుందని,  దీనిని మధురాన్నం ట్రస్ట్ వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు.  గత కరోనా సమయంలో కూడా వేలాది మంది వలస కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సహాయకులకు, రోగుల సహాయకులకు భారీ ఎత్తున భోజన వసతులు కల్పించడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చొరవ, వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు.  ముఖ్యమంత్రి స్పూర్తి తో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలలో రోజుకు నాలుగు వేల మందికి ఉచిత భోజన కార్యక్రమాలు కొనసాగించామన్నారు.  ముఖ్యమంత్రి  ఆదేశాలను అనుసరిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలను మధురాన్నం ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.  
  కార్యక్రమంలో మధురాన్నం ట్రస్ట్ కార్యదర్శి పెనుమచ్చ రామకృష్ణ గోపాల రాజు,  కోశాధికారి పేరూరి కాసయ్య, జాయింట్ సెక్రటరి పి. సత్యనారాయణ మూర్తి, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు,  జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి, రెడ్ క్రాస్ సొసైటి వైస్ ఛైర్మన్ రామచంద్ర రాజు, భారతీయ విద్యా మిషన్ కోశాధికారి మాజేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.