రోడ్లపై పశు సంచారాన్ని నియంత్రించాలి..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-06-24 15:19:46

మహా విశాఖ నగర పరిధిలోని రోడ్లపై పశు సంచారం లేకుండా చూడాలని జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన శానిటరి అధికారులను ఆదేశించారు. గురువారం 3వ జోన్, 14వ వార్డు పరిధిలోని సీతమ్మధారలోని ఎ.ఎస్.ఆర్.నగర్ పరిసర ప్రాంతాలలో ఆమక పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్లపై ఆవులు, గేదెలు సంచారం ఎక్కువగా ఉందని వాటి వలన రోడ్లన్నీ అసభ్యంగా తయారవుతున్నాయని శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పశువుల యజమానులకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. రోడ్డుపై మెకానిక్, అతని సామాగ్రి ఉండడం చూసి వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించాలని, ఆ షాపు యజమాని నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ ప్రదేశాల్లో ఉన్న చెత్తను తొలగించాలని, ఖాళీ ప్రదేశాలు, ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురికాకుండా  చూడాలన్నారు. ఆయా ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనముల యొక్క నిర్మాణ సామగ్రి రోడ్డుపై ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మించుకునే వారు రోడ్డుపై భవన నిర్మాణ సామాగ్రిని వేయరాదని హెచ్చరించారు. వర్షం వలన ఎగువ ప్రాంతం నుండి బురద ఇసుకమేట రోడ్డు పైకి వచ్చిందని, దానిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. 
అనంతరం శాంతి ఆశ్రమం వద్ద సముద్రంలో కలుస్తున్న మురుగునీటి కాలువలు పరిశీలించి, మురుగు నీరు సముద్రంలో కలవకుండా ఎస్.టి.పి.కి మళ్ళించే పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి..శాస్త్రి, 3వ జోనల్ కమిషనర్(ఇంచార్జ్) బి.వి.రమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ భాస్కర్ బాబు, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, శివ ప్రసాద్ రాజు, కార్యనిర్వాహక ఇంజినీర్లు వెంకటేశ్వరరావు(యు.జి.డి.),  చిరంజీవి (మెకానికల్), శ్రీనివాస్ (వాటర్ సప్లై), శ్రీనివాస్ (వర్క్స్) తదితరులు పాల్గొన్నారు.