అన్ని ప్రభుత్వ శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి, ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని సకాలంలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని అన్నారు. లేఅవుట్లలో నెలాఖారునాటికి మౌలిక వసతులు కల్పించాలని జెసి (హౌసింగ్) అధికారులను ఆదేశించారు. విజయనగరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల నిర్మాణంపై, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంఎల్ఏ కోలగట్ల మాట్లాడుతూ, పేదల సొంతింటికలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనిలో భాగంగానే ప్రతీ జిల్లాకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించిందని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇళ్లు మంజూరైన లబ్దిదారులను చైతన్య పరిచి, వారు తక్షణమే నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాలని సూచించారు. జులై 1 నుంచి మెగా శంకుస్థాపనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఎంఎల్ఏ తెలిపారు.
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, అన్ని లేఅవుట్లలో ఈ నెలాఖరునాటికి మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ కనక్షన్‌లు యుద్దప్రాతిపదికన పూర్తిచేసి, బోర్లుకు మోటార్లు బిగించాలని సూచించారు. జులై 1 నాటికి అన్ని లేఅవుట్లలో నీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంపై జెసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. ఇకనుంచీ ఇళ్ల నిర్మాణంపై ప్రతీరోజూ సమీక్ష నిర్వహించాలని ఎంపిడిఓను ఆదేశించారు. అతిపెద్ద గుంకలాం లేఅవుట్ ను దేశంలోనే ఒక మోడల్ కాలనీగా రూపొందుతుందని అన్నారు. భవిష్యత్తులో ఇదొక నగర పంచాయితీగా మారుతుందన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పుడు మాత్రమే, లక్ష్యం పూర్తిగా నెరవేరినట్లని, అంతవరకూ ప్రతీఒక్కరూ సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేయాలని జెసి కోరారు.
సమావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, హౌసింగ్ పిడి ఎన్‌వి రమణమూర్తి, తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, ఎంపిడిఓ చైనులు, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల డిఇలు, ఏఈలు, వార్డు ఎనిమిటీ అసిస్టెంట్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.