ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేయాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-06-25 13:30:11
విశాఖజిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకల సంఖ్యను పెంచుకోవాలని అందుకు అవసరమైన ప్రణాళికలు ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరు జిల్లాలోని కె జి హెచ్, విమ్స్, ఆర్ సి డి, ఛాతీ ఆసుపత్రి, ఘోషా ఆసుపత్రి, మరియు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు వివరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటి లేటర్లు, మానిటర్లు మొదలగు వాటి ప్రస్తుత సంఖ్య, వాటిని ఏమేరకు పెంచగలము అనే విషయముపై వైద్యాధికారులు, ఎపి ఎస్ ఎమ్ ఐ.డి.సి. అధికారులతో చర్చించారు. ఈ సందర్భముగా కలెక్టరు ఆసుపత్రుల వారీగా చర్చించి పలు సూచనలు చేశారు. ఎపి ఎస్ ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డి.ఎ.నాయుడును కె జి హెచ్ లోని వార్డులను స్వయంగా పరిశీలించి పడకల పెంపుదలకు, పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కె.జి.హెచ్.లో పీడియాట్రిక్ వెంటిలేటర్లు ఎన్ని కావాలో అంచనా వేయాలన్నారు. విమ్స్ ఆసుపత్రిలో పడకల సంఖ్య 650 కి పెంచాలని వాటికి ఆక్సిజన్ సరఫరాకు లైన్లను పరిశీలించాలన్నారు. ఛాతీ ఆసుపత్రి లో ఆక్సిజన్ బెడ్లు 50 కి పెంచాలన్నారు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులపై సమీక్షస్తూ ప్రతి రోజు ఒక ఆసుపత్రిని పరిశీలించాలని డి సి హెచ్ ఎస్ లక్ష్మణరావును ఆదేశించారు. ఆక్సిజన్ బెడ్లు పెంచాలన్నారు. అనకాపల్లి, పాడేరు, అరకు, నర్సీపట్నంలలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, మరియు సి.హెచ్.సి.లలో ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంపుదల అందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రతి పి.హెచ్.సి, కోవిడ్ కు సంబంధించి టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ విషయాలలో సమర్దవంతంగా పనిచేయగలిగేలా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సూర్యనారాయణ, ఆసుపత్రుల జిల్లాకోఆర్డినేటర్ డా.లక్ష్మణరావు, ఎపి ఎస్ ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డి.ఎ.నాయుడు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు.