రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో జిల్లాలోని పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ వచ్చే జూలై 1,3,4 తేదీల్లో జిల్లాలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. జూలై 1, 3 తేదీల్లో 8,900 ఇళ్లు చొప్పున, 4న 8,974 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా ప్రత్యేక క్యాంపెయిన్‌లో మొత్తం 26,774 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. జిల్లాలో 98,286 ఇళ్లు తొలి విడతలో మంజూరు కాగా ఇందులో లే అవుట్లలో 53,403, లబ్దిదారుల సొంత స్థలాల్లో 44,883 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలో 8,833 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. జూలై 1,3,4 తేదీల్లో చేపట్టే ప్రత్యేక ఇళ్లనిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఒక్కో జాయింట్ కలెక్టర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తున్నామని, మరో నియోజకవర్గం బాధ్యతలు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోసం మండల, నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులను ఇప్పటికే నియమించామని వీరందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని ఉద్యమ రీతిలో చేపట్టేందుకు గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సి.ఎం.ఓ. అధికారులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌లు, హౌసింగ్ జాయింట్ కలెక్టర్‌లు, గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్సులో తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణ కార్యాచరణ ప్రణాళికను ముఖ్య కార్యదర్శికి వివరించారు. మండల స్థాయి అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో శనివారం సమావేశమై ఇళ్ల నిర్మాణ కార్యాచరణపై చర్చిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు ఒక్కొక్కరికి మూడు సచివాలయాల పరిధిలో ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అందరినీ దీనిలో భాగస్వాములను చేసి వారికి కూడా లక్ష్యాలు నిర్దేశిస్తామని పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణంలో జిల్లాలోని అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేసి వారి సహకారం తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణ కార్యాచరణపై వారితో చర్చించి ఖరారు చేస్తామన్నారు. గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ జూలై 1,3,4 తేదీల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక కాంపెయిన్ చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని, మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్ని శాఖల భాగస్వామ్యంతో విజయవంతం చేసినట్లే ఇళ్ల నిర్మాణంలోనూ అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేయాలని ఆదేశించినట్లు టెలికాన్ఫరెన్సులో చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ జూలై 1,3,4 తేదీలను స్పెషల్ క్యాంపెయిన్ దినాలుగా పరిగణించి ఆయా రోజుల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున ఇళ్ల పనులు ప్రారంభించాలని సూచించారు. టెలి కాన్ఫరెన్సులో గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఎస్.వి.రమణమూర్తి కూడా పాల్గొన్నారు.