ఇళ్ల నిర్మాణాలపై అధికారులకు శిక్షణ..
Ens Balu
4
Vizianagaram
2021-06-25 14:13:00
విజయనగరం జిల్లాలో జూలై నెల 1, 3, 4 తేదీలలో నిర్వహించనున్న గృహ నిర్మాణాల మేళాపై మండల ప్రత్యేకాధికారులకు శనివారం ఉదయం శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్లతో ఆయన ఛాంబరులో మేళా ఏర్పాట్లపై సమీక్షించారు. మేళా విజయవంతం చేయడానికి సంయుక్త కలెక్టర్లను, సబ్ కలెక్టర్ ను, ఐటిడిఎ పి.ఓను నియోజక వర్గాల పర్యవేక్షణాధికారులుగా నియమించారు. నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, మండల ప్రత్యేకాధికారులు గృహ నిర్మాణాల మేళాకు ఇన్ ఛార్జిలుగా వ్యవహరిస్తారన్నారు. ప్రతీ మండలంలో మంజూరైన అన్ని గృహాలను 1వ తేదీన ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు. మిగిలిపోయినవి 3, 4వ తేదీలలో పూర్తి చేయాలన్నారు. అందుకోసం మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, సచివాలయాల కార్యదర్శిలను, వాలంటీర్లను పూర్తి స్థాయిలో బాగస్వామ్యమయ్యేలా చూడాలన్నారు. శిక్షణకు అవసరమగు అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని గృహినిర్మాణ జె.సి. మయూర్ అశోక్ కు సూచించారు. ఇన్ ఛార్జి అధికారులందరికి వెంటనే ఉత్తర్వులు సిద్దం చేయాలని హౌసింగ్ పిడి రమణమూర్తికి సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు డా.మహేష్ కుమార్, జె.వెంకటరావు, సిపిఓ విజయలక్ష్మీ పాల్గొన్నారు.