ఫీవర్ సర్వేతోపాటు కరోనా టెస్టులు పెంచాలి..
Ens Balu
3
Kakinada
2021-06-25 14:41:26
ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో అత్యంత సమర్థవంతంగా ఫీవర్ సర్వే, పీవర్ క్లినిక్‌ల నిర్వహణ కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వివేకానంద హాల్‌లో కోవిడ్ ప్రస్తుత పరిస్థితి, కట్టడి చర్యలతో పాటు మూడో దశ సన్నద్ధత కార్యాచరణపై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి జిల్లా, డివిజనల్ స్థాయి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంకా కోవిడ్ కేసులు నమోదవుతున్నందున , రోజుకు కరోనా పరీక్షలు 12 నుంచి 15 వేల వరకు పెంచాలని ఆదేశించారు. అంతేకాకుండా నిర్లక్ష్యానికి తావులేకుండా కోవిడ్ నివారణ, నియంత్రణ చర్యలను కొనసాగించాలన్నారు. పరీక్షలు, చికిత్స, కంటైన్‌మెంట్, వ్యాక్సినేషన్ తదితర అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కూడా పూర్తి అవగాహనతో జాగ్రత్తలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా; పడకలను బట్టి సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తప్పనిసరిగా సమకూర్చుకునేలా చూడాలన్నారు. పీఎస్ఏ యూనిట్లను తప్పనిసరిగా ఏర్పాటుచేసుకొని, దశల వారీగా 1000 ఎల్‌పీఎం సామర్థ్యాన్నికి పెంచుకోవాలన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య ఉపకరణాల అందుబాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా ప్రైవేటు ఆసుపత్రులపై నిరంతర సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు. పీడియాట్రిక్ సాధారణ, ఐసీయూ పడకల ఏర్పాటు; ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ, కోవిడ్ ప్రొఫైల్ పరీక్షల నిర్వహణ, ఔషధాలు, ఫిర్యాదుల పరిష్కారం, మానవ వనరుల నియామకం, శిక్షణ తదితరాలకు సంబంధించి పటిష్ట వ్యవస్థను ఏర్పాటుచేయాలని సూచించారు. నోడల్ అధికారుల వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, కొత్త నోడల్ అధికారులకు సరైన విధంగా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రుల వారీగా మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికపైనా కలెక్టర్ చర్చించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, డీసీహెచ్ఎస్ డా. రమేశ్ కిషోర్, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. కె.బాబ్జీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధర్, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త పి.రాధాకృష్ణ, ఏపీ ఎంఎస్ఐడీసీ ఈఈ కె.సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.