కోవిడ్ మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కార్యాచరణ రూపొంచాలని డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.57 ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ప్రాథమిక మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. కోవిడ్‌తో సంబంధం లేకుండా 100కు పైబడి పడకలు ఉన్న ఆసుపత్రులు 100 ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ పడకలకు సమాన సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, ఆక్సిజన్ మాస్కులు, రెగ్యులేటర్లను సమకూర్చుకోవాలన్నారు. అదే విధంగా వెయ్యి ఎల్‌పీఎం సామర్థ్యమున్న ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆక్సిజన్ యూనిట్‌కు ఆగస్టు 1వ తేదీ డెడ్‌లైన్ కాగా.. మిగిలిన వాటి ఏర్పాటుకు జులై 7వ తేదీని గడువుగా నిర్దేశించినట్లు తెలిపారు. 50 నుంచి 100 పడకలున్న ఆసుపత్రులు 100 ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ పడకలకు సమాన సంఖ్యలో కాన్సంట్రేటర్లు, మాస్కులు, రెగ్యులేటర్లు ఏర్పాటు చేసుకోవాలని, వీటికి అదనంగా 500 ఎల్‌పీఎం సామర్థ్యమున్న ఆక్సిజన్ పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. 50లోపు పడకలుంటే 40 ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ పడకలకు సమాన సంఖ్యలో కాన్సంట్రేటర్లు, మాస్కులు, రెగ్యులేటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మూడో వేవ్‌లో చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందన్న సూచనల నేపథ్యంలో సన్నద్ధతతో పీడియాట్రిక్ సాధారణ, ఐసీయూ పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీడియాట్రిక్ వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం, ఆక్సిజన్ పైపులైన్ల ఏర్పాటు, ఔషధాలు తదితరాలపై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేకంగా 200 పీడియాట్రిక్ పడకలతో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్రయాజింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లోనూ మూడో వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్న కలెక్టర్ వెల్లడించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి మాట్లాడుతూ కోవిడ్ పోరాట యోధులుగా సేవలు అందిస్తూ మరణించి హెల్త్ కేర్ వర్కర్ల కుటుంబాలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇన్య్సూరెన్స్ పధకం అందించే 50 లక్షలు పరిహారం కొరకు జిల్లాలో ఇప్పటి వరకూ 17 ధరఖాస్తులు అందగా, 8 ధరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను చెల్లించడం జరిగిందని, మరో 9 ధరఖాస్తులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ పధకంతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ చికిత్సలు అందిస్తూ మరణించిన డాక్టర్లకు 25 లక్షలు, స్టాఫ్ నర్సులకు 20 లక్షలు, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలకు 15 లక్షలు, ఇతర ఆరోగ్య సిబ్బందికి 10 లక్షలు చొప్పున ఎక్సగ్రేషియా ప్రకటించిందన్నారు. కోవిడ్ సేవలు అందిస్తూ మరణించిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కుటుంబాలు ఈ పరిహారాల కొరకు ధరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. చిన్న పిల్లలను పొంచి ఉన్న కోవిడ్ ధర్డ్ వేవ్ ముప్పునుండి రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నామన్నారు. కాకినాడ జిజిహెచ్లో 200 పడకలతో పిడియాట్రిక్ విభాగాన్ని సిద్దం చేస్తున్నామని, అలాగే 50 ఆపై పడకలున్న సిహెచ్సి లలో 700 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు పనులు నాలుగు రోజులలో పూర్తి కానున్నాయన్నారు. 3నెలల కాలానికి నియమించిన కోవిడ్ సిబ్బంది సేవలను 6 నెలలకు పొడిగించడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ యోజన క్రింద ప్రతి నెల 9వ తేదీన గర్బిణులకు పి హెచ్ సిలలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల సందర్భంగా గర్బవతులలో కోవిడ్ పాజిటీవ్ సోకిన వారిని గుర్తించి వైద్య పర్యవేక్షణలో ఉంచుతున్నామన్నారు. పాఠశాల విద్య, ఐసిడిఎస్ సిబ్బందికి కోవిడ్ లక్షణాలుష కలిగిన పిల్లలను గుర్తించండంలో ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. చాలా మంది స్వంత వైద్యంతో కోవిడ్ ట్రీట్మెంట్ జాప్యం చేసుకుని ఆఖరి నిమిషంలో చికిత్సకు రావడం వల్ల ప్రాణాలు కాపాడటం కష్టమౌతోందని, కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తప్పని సరిగా కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రుల సేవలను పొందాలని కోరారు.
ఆర్ఎంసి ప్రిన్సిపాల్ డా.బాబ్జీ మాట్లాడుతూ కోవిడ్ ఫస్ట్, సెంకండ్ వేవ్ లను జిల్లా యంత్రాంగం సహకారంతో ఆర్ఎంసి, జిజిహెచ్ లు సమర్ధవంతంగా ఎదుర్కోవడ జరిగిందన్నారు. కోవిడ్ ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అత్యుత్తమమైన నియోనేటల్ సేవలు కాకినాడ జిజిహెచ్ పిడియాట్రిక్ విభాగంలో అందుబాటులో ఉన్నాయన్నారు. జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రిలో 280 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా మల్టీ డిసిప్లినరీ టీములతో 100 మందికి సర్జరీలు చేసామని, 15 నెలల బాబుకు అరుదైన సర్జరీ విజయవంతంగా నిర్వహించమాన్నారు. కోవిడ్ ఒకసారి వచ్చిన వారికి మరో మారు రాదనే అపోహలను ప్రజలు వీడి ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలను తప్పని సరిగా పాటించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డా. గౌరీశ్వరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.