రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికి ఇళ్ల నిర్మాణంలో భాగంగా జులై 1వ తేదీ నుండి మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాను జిల్లాలో నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. గృహ నిర్మాణాలకు ఆయా గ్రామాల వారీగా లబ్ధిదారులను సమాయత్తం చేయడంతో పాటు, ఇందుకు అవసరమైన ఇసుక కూపన్లు, సిమెంటు సరఫరా తదితరాలపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 90వేల గృహ నిర్మాణాలకు గాను 80వేల గృహాలకు గ్రౌండింగ్ జరగాల్సి ఉందన్నారు. ఇవన్నీ జూలై 1వ తేదీ నుండి గ్రౌండింగ్ ప్రారంభం కావాలన్నారు. జులై 1,2,3,4 తేదీల్లో జిల్లాలోని అన్ని గృహాలు గ్రౌండింగ్ కావాలని, ప్రతీ రోజు సుమారు 16వేలకు పైచిలుకు గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రౌండింగ్ అయిన వెంటనే గృహ నిర్మాణాలకు సంబందించిన ఇసుక, సిమెంట్, ఇతర సామాగ్రిని ఆయా హౌసింగ్ ఏ.ఈలు సిద్ధం చేసుకోవాలని, గ్రౌండింగ్ ఆయిన తక్షణమే గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గృహాలు మహిళల పేరునే ఉన్నందున స్వయం సహాయక బృందాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా గ్రౌండింగ్ అయ్యేందుకు అవసరమైన నిధులను సమకూర్చాలని డి.ఆర్.డి.ఏ పథక సంచాలకులు బి.శాంతిశ్రీని కలెక్టర్ ఆదేశించారు. దూర ప్రాంతాల్లో ఉండే లే అవుట్లకు లబ్ధిదారులు చేరుకునేందుకు వీలుగా మండల అధికారులు, మునిసిపల్ కమీషనర్లు రవాణా సదుపాయాలతో పాటు లేఅవుట్ల వద్ద టెంటు మరియు ఇతరత్రా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. గృహాలు గ్రౌండింగ్ విషయమై లబ్దిదారులకు ముందుగానే తెలియపరచాలని, ఇందుకు రానున్న 4 రోజుల్లో జిల్లా, మండల, గ్రామ స్థాయి సమావేశాలను ఏర్పాటుచేసి లబ్దిదారులకు వివరించాలని చెప్పారు. ఈ నెల 30 నాటికి జిల్లాలోని అన్ని గృహాలు గ్రౌండింగ్ నకు సిద్ధం కావాలని, లేఅవుట్లలో విద్యుత్, తాగునీరు అత్యంత ఆవశ్యకమని వాటిని సంబంధిత శాఖాధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వివరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి కమిటీలు వేసి వాటిని సకాలంలో పూర్తిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మనాథ్, గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహనరావు, ఆర్.డబ్ల్యూ.ఎస్., ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ ఎస్.ఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.