పారిశ్రామిక వేత్తలు ముందుకి రావాలి..


Ens Balu
3
Srikakulam
2021-06-25 16:06:34

శ్రీకాకుళం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకురావాలని, ప్రభుత్వం తరపున వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 290 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దరఖాస్తులు చేసుకున్నారని, వాటిలో 264 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, 14 దరఖాస్తులను త్రిప్పిపంపడం జరిగిందని,  12 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగులో ఉన్నాయన్నారు. వచ్చిన దరఖాస్తులపై ఎప్పటికపుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పరిశ్రమలు నెలకొల్పేందుకు జిల్లా అన్నివిధాల అనుకూలంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. నాగావళి నది నీటిని పరిశ్రమలకు వినియోగించుకునేందుకు సాధ్యసాధ్యాలపై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణను కోరారు. అనంతరం పెండింగులో ఉన్న విషయాలపై చర్చించి జిల్లా కలెక్టర్ ఆమోదించడం జరిగింది.

జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ మాట్లాడుతూ  జిల్లాలో 290 దరఖాస్తులు తమకు వచ్చాయని, వచ్చిన వాటిని సింగిల్ విండో విధానంలో ఆమోదించడం జరిగిందని చెప్పారు. వచ్చిన దరఖాస్తులపై వారం నుండి 21 రోజుల్లోగా అనుమతిని ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు వివరించారు.  

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ బి.గోపాలకృష్ణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.వి.బి.డి.హరిప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా అగ్నిమాపకదళ అధికారి సిహెచ్. కృపావరం, పి.వి.యస్.రామ్మోహన్, ఇతర అధికారులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.