గ్రామ వార్డు సచివాలయాలలో కొన్ని రకాల సేవలు మాత్రమే ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని, మొత్తం సచివాలయాలు అందించే 545 రకాల సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేవలం ఉద్యోగంలో చేరే ముందు ఒక్కసారి శిక్షణ ఇస్తే జీవిత కాలం అదే శిక్షణ సరిపోతుంది అనే భావన వీడాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా సచివాలయ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. సచివాలయాలలో సేవలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలోని సచివాలయాన్ని తనిఖీ చేసి రావడం ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే ప్రజలకు మెరుగైన సేవలు, నిర్ణీత సమయంలో దక్కుతాయన్నారు.
జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని సచివాలయాలలోనూ త్వరితగతిన ఆధార్ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కేవైసీ కోసం ఉపయోగించే పరికరాల కొరత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన వాలంటీర్ల నియామకాలు పునః ప్రారంభించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా. సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, మునిసిపల్ ఆర్డీ నాగరాజు, అనంత మునిసిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి , డిప్యూటీ సీఈవో శ్రీనివాసులు, డీపీవో పార్వతమ్మ, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.