మహావిశాఖ నగర పరిధిలో పారిశుద్ధ్యం లోపిస్తే సహించేది లేదని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆమె నాలుగవ జోన్ 33వ వార్డు పరిధిలోని వివేకానంద కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మన విశాఖను ఒక సుందర నగరంగా చూడాలని, అందుకు అందరూ సమిష్టిగా పని చేయాలని అన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియ ఉన్నచోట డంపర్ బిన్స్, లిట్టర్ బిన్స్ ను తొలగించి కొన్ని రోజులు బిన్స్ తొలగించిన ప్రాంతాలను పరిశీలించాలని, ఎవరైనా చెత్త ఆ ప్రాంతంలో వేసినచో వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. తడి-పొడి చెత్త పై మహిళలకు అవగాహన పెంచి, తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసే విధానాన్ని వారికి తెలియపరచాలన్నారు. అనంతరం, అల్లిపురంలోని పలు ప్రాంతాలలో పర్యటించి బహిరంగ ప్రదేశాలలో చెత్త ఉండటం గమనించి, ఆ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్, సచివాలయ శానిటరీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు.
ఆంధ్ర యూనివర్సిటీ సర్క్యూట్ హౌస్, పోర్ట్ గెస్ట్ హౌస్, కిర్లంపూడి లే అవుట్, సాగర్ నగర్ తదితర ప్రాంతాలలో కుక్కలు, పందులను వెంటనే తొలగించాలని సిటీ వెటర్నరి డాక్టర్ కిషోర్ ను ఆదేశించారు. పోర్ట్ గెస్ట్ హౌస్ కు వెళ్లే రహదారిలో పండ్లు, కాయగూరలు అమ్మే వ్యాపారులు, ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని వారిని అక్కడ నుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, సిటీ వెటర్నరి డాక్టర్ కిషోర్ ,పర్యవేక్షక ఇంజినీర్లు చిరంజీవి, గణేష్ కుమార్, ఎ.ఇ. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.