నెలన్నర రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి...కలెక్టర్
Ens Balu
3
Srikakulam
2020-09-01 16:11:34
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ దృష్ట్యా రానున్న నెలన్నర రోజులు అతి కీలకమని భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. మంగళవారం నగరంలో కంటెంట్మెంట్ జోన్లలో పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ తో కలిసి జిల్లా కలెక్టర్ నివాస్ పర్యటించారు. హాయతినగర్, ఫోజుల్ బేగ్ పేట, హడ్కో కాలనీ, చల్లవీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు చేపడుతున్న సర్వే లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, ప్రతి రోజు శ్రీకాకుళం నగరంలో రెండు వందల నుండి 250 కేసులు పాజిటివ్ వస్తున్నాయని అన్నారు. జిల్లాలో గత రెండు రోజులు రోజుకు వెయ్యి కేసులు నమోదు అయ్యా యన్నారు. 25 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు కాగలదని భావిస్తున్నామని, ఈ తరుణంలో రానున్న ఒకటిన్నర నెలలు అతి కీలకంగా భావిస్తూ అందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కాంటైన్మెంట్ జోన్లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు తిరగవద్దని కోరారు. మొబైల్ వాన్ల ద్వారా కూరగాయలు, తాగునీరు వంటి సౌకర్యాలు అందించే చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. లాక్ డౌన్ సడలింపు తరువాత జిల్లాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు.
ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య దృష్ట్యా హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వైరస్ నివారణ లో భాగంగా స్లమ్ ప్రాంతాల్లో 20 వేల మందికి ఫేస్ షీల్డ్ లను పంపిణీ చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వాలంటీర్లు అందరికీ ఫేస్ షీల్డ్ లు పంపిణీ చేశామని ఆయన అన్నారు. రోజుకు 9 వందల వరకు రాపిడ్ టెస్టులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 24 గంటల్లో ఫలితాలు వెల్లడికి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు తిరగవద్దని కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే తెలియజేయాలని, త్వరగా రావడం వలన ప్రాణాపాయ స్థితి ఉండదని గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించామని నలుగురు కంటే ఎక్కువ మంది ఎక్కడా ఉండరాదని చెప్పారు. శ్రీకాకుళం, పలాస, సోంపేట, మెలియాపుట్టి, పొందూరు, రాజాం ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు చెప్పారు. ఇంట్లో పెద్ద వయసు వారికి ప్రమాదమని యువత గ్రహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లో నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, పట్టణ పర్యవేక్షణ అధికారి టి.వేణుగోపాల్, ప్రత్యేక అధికారులు టి వివి ప్రసాద్, ప్రసాద్, తాహసిల్దార్ వై వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.