హౌసింగ్ మెగా డ్రైవ్ విజయవంతం కావాలి..


Ens Balu
2
Srikakulam
2021-06-26 08:48:40

శ్రీకాకుళం జిల్లాలో జూలై 1 నుండి జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న హౌసింగ్ మెగా డ్రైవ్ కార్యక్రమం విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆకాంక్షించారు. కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమంలో అత్యధిక టీకాలను వేసి రాష్ట్రస్థాయిలో  జిల్లా ముందంజలో ఉంచారని, అధికారుల సమిష్టికృషితో  హౌసింగ్ మెగా డ్రైవ్ కూడా దిగ్విజయం చేయాలని అధికారులను కోరారు. హౌసింగ్ మెగా డ్రైవ్ కార్యక్రమంపై శనివారం మండల ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమీషనర్లు, మండల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలందరికి ఇళ్లు కార్యక్రమం క్రింద లబ్ధిదారులకు ఇప్పటికే స్థలాలాను కేటాయించడం జరిగిందన్నారు. కేటాయించిన లేఅవుట్లలో గృహనిర్మాణాలకు సంబంధించిన గ్రౌండింగ్ వర్కు జూలై 1,3,4 తేదీల్లో జిల్లావ్యాప్తంగా ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 92,716 ఇళ్లస్థలాలకు గాను 81,585 గృహాలు గ్రౌండింగ్ కావలసి ఉందన్నారు. లేఅవుట్లలో ఉన్న ప్రతీ స్థలానికి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ కావాలని, లేఅవుట్లలో నీటిసరఫరా, విద్యుదీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సి.సి.రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పార్కుతో బ్యూటిఫికేషన్ వంటి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్ధేశించిన సమయానికి గృహాలు పూర్తికావాలంటే యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉందని, ఇందుకు వివిధ కమిటీలను ఏర్పాటుచేసి వారికి విధులను కేటాయించడం జరిగిందన్నారు. గృహ నిర్మాణాల మెగా గ్రౌండింగ్ డ్రైవ్ విషయమై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెగా గ్రౌండింగ్ మరియు గృహనిర్మాణాలు కేవలం గృహనిర్మాణ శాఖకు మాత్రమే సంబంధించినది కాదని, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్.డబ్ల్యు.యస్ తదితర శాఖల సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. 

ఇందుకు జిల్లా స్థాయి అధికారులను మండల ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, వీరంతా వారికి కేటాయించిన మండలాలను సందర్శించి ఈ నెల 27,28 తేదీల్లో మండలస్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 29న సచివాలయ స్థాయిలో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు శిక్షణను నిర్వహించాలన్నారు. 30న వాలంటీర్లు తమ పరిధిలోని లబ్ధిదారులను మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంపై చైతన్యపరచి, లబ్ధిదారులు వాలంటీరు సహాయంతో గ్రౌండింగ్ మేళాకు విచ్చేసి తమ గృహ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. గ్రౌండింగ్ మేళా కార్యక్రమంపై అధికారి నుండి వాలంటీరు వరకు క్షుణ్ణంగా తెలిసిఉండాలని, అపుడే లబ్ధిదారునికి పూర్తి సమాచారాన్ని ఇవ్వగలుగుతారని ఆయన స్పష్టం చేసారు. హౌసింగ్ మెగా డ్రైవ్ ప్రారంభం అయిన వెంటనే లేఅవుట్లలో గృహాల సంఖ్యను బట్టి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇతరత్రా వసతుల విషయమై హౌసింగ్ ఏ.ఇలు దృష్టి సారించాలని అన్నారు. కోవిడ్ నేపధ్యంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుందని, దీనికోసం ప్రతి జిల్లాకు ఒక సంయుక్త కలెక్టరును నియమించిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. అధికారులందరూ సమిష్టిగా కృషిచేసి ఈ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

                ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, గృహనిర్మాణ శాఖ సంయుక్త సంచాలకులు హిమాంశు కౌశిక్, గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.