రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద జిల్లాలో జులై 1,3,4 తేదీల్లో మెగా ఇళ్ల నిర్మాణ గ్రౌండింగ్ మేళా జరగనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు స్థితిగతులు, మెగా గ్రౌండింగ్ మేళా సన్నద్ధత ప్రణాళికపై జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, జేసీ (హెచ్) ఎ.భార్గవ్ తేజలతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులతో శనివారం ఉదయం కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేసినట్లుగానే ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళాను కూడా విజయవంతం చేయాలని, ఇందుకు గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు మధ్య పటిష్ట సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేయూతతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు లబ్ధిదారులు పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు ప్రారంభించేలా రూ.1,80,000 యూనిట్ వ్యయంతో మంజూరు చేసిన ఇళ్లకు అదనపు ఆర్థిక మద్దతుగా ఎస్‌హెచ్‌జీ లింకేజీ ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్సు రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. జులై మొదటి వారంలో చేపట్టే మెగా మేళా సందర్భంగా రూ.200 కోట్ల ఎస్‌హెచ్‌జీ లింకేజీ అడ్వాన్సు రుణాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో విలువ పరంగా ఉత్తమ లేఅవుట్లలో ఇళ్లనిర్మాణాలకు ఇది సరైన సమయమని, అన్ని వనరులను ప్రభుత్వం అందుబాటులో ఉంచినందున లబ్ధిదారులు ఊళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు వాలంటీర్లు; సచివాలయ సిబ్బంది.. లబ్ధిదారులను ప్రోత్సహించాలని, వారికి ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేయాలన్నారు. మేళా సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో లక్ష్యానికి మంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చూడాలని, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి వార్డుల వారీగా లక్ష్యాలను నిర్దేశించి, లేఅవుట్లలో నోడల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి, సలహాలు, సూచనలు అందించేందుకు జిల్లాస్థాయి కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయాలన్నారు. లేఅవుట్లలోఇళ్ల నిర్మాణాలు సజావుగా సాగేందుకు ఇసుక, నీరు, విద్యుత్ తదితర వసతులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, మునిసిపల్ కమిషనర్లు, ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.